Sunday, November 16, 2025
Homeనేషనల్India Warns Pakistan: నోరు అదుపులో పెట్టుకోండి.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

India Warns Pakistan: నోరు అదుపులో పెట్టుకోండి.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

India’s Warning to Pakistan : కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది.. అదుపు తప్పుతున్న మాటలు! సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్థాన్ నేతలు, సైన్యాధికారులు ఏకంగా అణుయుద్ధ బెదిరింపులకు దిగుతుంటే.. భారత్ తన సహనాన్ని వీడింది. ‘నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు’ అంటూ గట్టిగా, స్పష్టంగా హెచ్చరించింది. అసలు దాయాది దేశం ఎందుకింతగా రెచ్చిపోతోంది..? భారత్ ఇచ్చిన ఘాటు జవాబు వెనుక ఉన్న వ్యూహమేంటి..?

- Advertisement -

తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే : పాకిస్థాన్ అగ్రనాయకత్వం నుంచి వస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

“భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అగ్రనాయకత్వం ఈ మధ్య తరచూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. వారు చేసుకున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికే, భారత్‌పై విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా హానికర పరిణామాలు ఉంటాయి.”

– రణ్‌ధీర్ జైశ్వాల్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

పాక్ ప్రేలాపనల పరంపర : దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్థాన్‌లో ప్రధాని నుంచి ఆర్మీ చీఫ్ వరకు అందరూ భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు: అమెరికాలో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, భారత్‌పై నోరు పారేసుకున్నారు. “మాది అణ్వాయుధ దేశం. మా అస్థిత్వానికి ముప్పు వస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం. భారత్ డ్యామ్‌లు కట్టేవరకు చూసి, ఆ తర్వాత 10 క్షిపణులతో వాటిని పేల్చేస్తాం” అంటూ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని షరీఫ్ హెచ్చరిక: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం, “పాక్‌కు చెందిన ఒక్క నీటి చుక్కను కూడా భారత్ తీసుకోలేదు. సాహసిస్తే గట్టి గుణపాఠం చెబుతాం” అంటూ బెదిరింపులకు దిగారు.

బిలావల్ భుట్టో పిలుపు: పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పాక్ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

భారత్ దీటైన జవాబు : ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత్, పాకిస్థాన్‌ను ‘అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశం’గా అభివర్ణించింది. అమెరికా అండ చూసుకునే పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోందని విరుచుకుపడింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత, పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విందులో పాల్గొనడం గమనార్హం. ఏది ఏమైనా, దేశ భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad