QS Asia University Rankings 2026 : ప్రపంచ విద్యా యవనికపై భారత కీర్తి పతాక మరోసారి సగర్వంగా ఎగిరింది. ఆసియాలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల సరసన మన విద్యాసంస్థలు సత్తా చాటాయి. తాజాగా విడుదలైన ప్రతిష్టాత్మక ‘క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026’లో మన ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు సత్తా చాటాయి. ఈ జాబితాలో మన స్థానం ఎంత? అగ్రస్థానంలో నిలిచిన భారతీయ సంస్థ ఏది? ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎలా స్పందించారు? ఆ వివరాల్లోకి వెళ్తే..
టాప్-100లో మన ఏడు సంస్థలు : లండన్ కేంద్రంగా పనిచేసే క్వాక్వరెల్లి సైమండ్స్ (QS) సంస్థ, ఆసియాలోని 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో, ఏడు భారతీయ విద్యాసంస్థలు టాప్-100లో చోటు దక్కించుకుని సత్తా చాటాయి. వీటిలో ఐదు ఐఐటీలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), దిల్లీ విశ్వవిద్యాలయం, మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) ఉన్నాయి. మరో 20 సంస్థలు టాప్-200లో స్థానం సంపాదించడం విశేషం.
ఐఐటీ దిల్లీకి అగ్రస్థానం : ఈ ర్యాంకింగ్స్‌లో హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఆసియాలోనే తొలిస్థానంలో నిలవగా, భారతదేశంలో అత్యుత్తమ ర్యాంకును ఐఐటీ దిల్లీ కైవసం చేసుకుంది. ఆసియా స్థాయిలో 59వ స్థానంలో నిలిచి, దేశంలో అగ్రగామిగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే, ఏకంగా 36 భారతీయ విద్యాసంస్థలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకోవడం, దేశంలో ఉన్నత విద్యారంగం పురోగతికి అద్దం పడుతోంది. మరో 16 సంస్థలు తమ పాత ర్యాంకులను నిలబెట్టుకున్నాయి.
ప్రధాని మోదీ హర్షం : క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాల సంఖ్య గణనీయంగా పెరగడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “మన యువతకు నాణ్యమైన విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ ర్యాంకింగ్స్ మన విద్యాసంస్థల కృషికి నిదర్శనం,” అని ఆయన పేర్కొన్నారు.


