IRCTC Website Down in Diwali Festival Season: దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ సమీపిస్తోంది. దీపావళితో పాటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే ఛత్ పండుగ కూడా ఈనెల 25 నుంచి 28 వరకు జరగబోతుంది. ఈ పండుగలను కుటుంబంతో సంతోషంగా జరుపుకునేందుకు నగరాల నుంచి సొంతూళ్లకు వచ్చేస్తారు. ఈ క్రమంలోనే రైలు టికెట్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇలాంటి పండుగ సమయంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. శుక్రవారం ఉదయం నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మొరాయించింది. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో దీపావళి పండుగపై నీళ్లు చల్లినట్లైంది. టికెట్లు బుక్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్, యాప్ పని చేయలేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ కాలేదు. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఎర్రర్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారులు స్పందించారు. వైబ్‌సైట్, యాప్ క్రాష్ అయిందని.. తత్కాల్ రద్దీ సమయంలో ఈ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఐఆర్‌సీటీసీ సేవల్లో అంతరాయానికి సాంకేతిక సమస్యలే కారణమని పేర్కొన్నారు. ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే సాంకేతిక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయని, సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. అయితే, వెబ్‌సైట్ మొరాయించిన కొన్ని గంటల తర్వాత సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి.
రైల్వే స్టేషన్లకు పరుగులు..
అయితే, పండుగ సమయాల్లో వెబ్‌సైట్ ఎర్రర్ రావడం ఇదే తొలిసారి కాదు. ప్రతి పండుగ సమయాల్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంటుంది. వెబ్‌సైట్‌కు విపరీతమైన రద్దీ కారణంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు పరుగులు తీశారు. గంటల కొద్ది లైన్లలో పడిగాపులు కాస్తూ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే, ఆఫీసులకు సెలవు పెట్టి ఇలా రైల్వే స్టేషన్లకు వెళ్లి టికెట్ తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. సాంకేతిక సమస్యలు రాకుండా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
పడిపోయిన ఐఆర్‌సీటీసీ షేర్లు..
శుక్రవారం ఐఆర్‌ఎసీటీసీ వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక టికెట్లు బుకింగ్ సైట్, యాప్ క్రాష్ కావడంతో ఐఆర్‌సీటీసీ షేర్లు సైతం ప్రభావితం అయ్యాయి. శుక్రవారం 11:10 గంటలకు, కంపెనీ స్టాక్ BSEలో 0.28 శాతం తగ్గి రూ. 717.05 వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లో IRCTC షేర్లు 0.34 శాతం లాభాన్ని ఇవ్వగా.. గత రెండు వారాల్లో 1.44 శాతం పెరిగాయి. గత ఆరు నెలల్లో ఐఆర్‌సీటీసీ స్టాక్ 6.74 శాతం మేర తగ్గింది. గత సంవత్సరంలో ఈ స్టాక్ 17.69 శాతం తగ్గింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ప్రస్తుతం దాదాపు రూ. 57,400 కోట్లుగా ఉంది.


