Gujarat Election 2022: గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు పకడ్బందీ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తుంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీసైతం గుజరాత్‌లో పాగావేసేందుకు విస్తృత ప్రచారం చేస్తుంది. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోదీ సహా అమిత్‌షా, జేపీ నడ్డా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆప్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మాటల యుద్ధం సాగుతోంది.
గుజరాత్‌లో ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 92 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. డైమండ్ సిటీ సూరత్ నుంచి ఆప్‌కు 7 నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా 92 సీట్లు వస్తాయని తన జోస్యాన్ని (గెలుపు సంఖ్యను) ఒక పేపరుపై రాసి మరీ ఆయన చెప్పారు. మా పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా భారీ ఆధిక్యంతో గెలుస్తారు. సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢవీ, పాటిదార్ ఉద్యమ మాజీ నేత అల్పేష్ కథిరియా కూడా గెలుస్తారు” అని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో వ్యాపారాలు ఎలాంటి భయాలు, బెదరింపులకు తావులేని విధంగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని తమ పార్టీ కల్పిస్తుందని చెప్పారు. యువతకు ఉద్యోగాలు వచ్చేంతవరకూ రూ.3,000 అలవెన్స్ ఇస్తామని భరోసా ఇచ్చారు.
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య పోటీ లేదని, తాము (ఆప్) ముందంజలో ఉన్నామని కేజ్రీవాల్ అన్నారు. సూరత్‌లో 12 అసెంబ్లీ స్థానాలుండగా, డిసెంబర్ 1న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నట్లు ఆప్‌కు గుజరాత్‌లో అన్ని సీట్లు రావాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశాలు ఉంటాయని, కానీ, అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ సమయం నాటికి ఏమైనా అనూహ్యమార్పులు జరిగితే చెప్పలేమని అంటున్నారు.