New Delhi: జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టులో భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి నిర్విరామంగా మూడేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజే జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయటం అందరికీ తెలిసిందే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై దేశ ప్రతిపక్ష నేతలకు పలు అనుమానాలు ఉన్నాయి.
ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగటానికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ జగదీప్ ధన్‌ఖడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారమే ఆమోదించారు. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది.
జగదీప్ ధన్‌ఖడ్ కి అధికారికంగా వీడ్కోలు పలుకుదామని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన కేంద్రం మౌనం వహించిందని వార్తలు వచ్చాయి. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా కూడా ఏం మాట్లాడలేదని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ప్రతిపక్షాల అనుమానాలకు ఆజ్యం పోసినట్టయింది.
Readmore: https://teluguprabha.net/national-news/amarnath-yatra-more-than-3-52-lakh-people-visited-in-21-days/
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకి ఏ కారణాలైన ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన బీఏసీ సమావేశంలో ఆయనకు అధికారికంగా వీడ్కోలు నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. కేంద్రం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రతిపక్ష వర్గాలు ఆయనకు వీడ్కోలు విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడ్కోలు విందుకు జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి.


