Cattle care services : అత్యవసరంగా ఊరికి వెళ్లాలి… కానీ ఇంట్లో కట్టేసిన పశువుల సంగతేంటి? వాటికి వేళకు మేత ఎవరు వేస్తారు? అనుకోకుండా వర్షం వస్తే ఎవరు చూస్తారు? పాడి రైతులను దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ బెంగకు ఝార్ఖండ్‌లోని ఓ సంస్థ అద్భుతమైన పరిష్కారం చూపింది. అవును, మీరు చదివింది నిజమే! మనుషుల్లాగే పశువులకు కూడా సకల సౌకర్యాలతో ‘హాస్టల్’ను ప్రారంభించి, దేశంలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అసలు ఈ వినూత్న ఆలోచన ఎవరిది? ఈ హాస్టల్‌లో ఎలాంటి సౌకర్యాలున్నాయి?
రైతుల కష్టానికి పరిష్కారం : పశుపోషణే జీవనాధారంగా బతికే ఎంతోమంది రైతులకు, అత్యవసర పనులపై ఊరు వెళ్లాలంటే అదొక పెద్ద అగ్నిపరీక్ష. ఈ సమస్యను గుర్తించిన ‘కోల్‌కతా పింజ్రాపోల్ సొసైటీ’కి చెందిన 140 ఏళ్ల నాటి ‘‘హజారీబాగ్ గోశాల కమిటీ’’ ఈ వినూత్న ఆలోచనకు ప్రాణం పోసింది. పాడి రైతులకు చేదోడుగా నిలవాలనే సంకల్పంతో దేశంలోనే తొలిసారిగా ఈ ‘పశువుల హాస్టల్’ను ప్రారంభించింది.
నామమాత్రపు రుసుము.. సకల సౌకర్యాలు : ఈ హాస్టల్ సేవలు పొందాలనుకునే రైతులు, పశువుల యజమానులు తమ ఆవులు, గేదెలను ఇక్కడికి తీసుకువచ్చి అప్పగించవచ్చు. దీనికి నిర్వాహకులు నామమాత్రపు రుసుమును మాత్రమే వసూలు చేస్తారు. ఆ రుసుముతో పశువులకు అన్ని సౌకర్యాలనూ కల్పిస్తారు.
సమయానికి మేత: పచ్చిగడ్డి, ఎండుగడ్డిని వేళకు అందిస్తారు.
పరిశుభ్రమైన వసతి: విశాలమైన, పరిశుభ్రమైన షెడ్డులో వాటికి వసతి కల్పిస్తారు.
వెంటనే వైద్య సాయం: పశువులకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, గోశాలలోనే అందుబాటులో ఉండే పశువైద్య నిపుణుడు వెంటనే చికిత్స అందిస్తారు.
పూర్తి భద్రత: రైతులు తిరిగి వచ్చేవరకు పశువులను కంటికి రెప్పలా కాపాడి, ఆరోగ్యంగా అప్పగిస్తారు.
“చాలామంది రైతులు ఊరు వెళ్లాలంటేనే ఒత్తిడికి గురవుతారు. పశువుల పరిస్థితేంటని బెంగ పెట్టుకుంటారు. వారి బాధను అర్థం చేసుకునే ఈ హాస్టల్‌ను ప్రారంభించాం. మా ఆలోచనకు రైతుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.”
– హజారీబాగ్ గోశాల కమిటీ సభ్యుడు
ఆదరణ అద్భుతం.. ఆదర్శనీయం : ప్రస్తుతం ఈ గోశాలలో 500కు పైగా ఆవులు, గేదెలు ఉన్నాయి. వీటిలో కమిటీ రక్షించినవి, ప్రజలు వదిలేసినవి పోగా, ‘హాస్టల్’ సేవలు పొందుతున్న పశువులు కూడా ఉంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, నిశ్చింతగా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘పశువుల హాస్టల్స్’ ఏర్పాటైతే పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


