Saturday, November 15, 2025
Homeనేషనల్Medical negligence : రక్తం పంచిన పాపం.. చిన్నారుల భవిష్యత్తు అంధకారం!

Medical negligence : రక్తం పంచిన పాపం.. చిన్నారుల భవిష్యత్తు అంధకారం!

Medical negligence HIV transfusion : ప్రాణం పోయాల్సిన వైద్యమే పసిమొగ్గల పాలిట శాపంగా మారింది. బతుకుపై ఆశలు చిగురింపజేయాల్సిన రక్తపు చుక్కలే వారి జీవితాల్లో కారుచీకట్లను నింపాయి. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించడం పెను దుమారాన్ని రేపింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమా? లేక వ్యక్తిగత కక్షల పర్యవసానమా? ఈ దారుణ ఘటన వెనుక ఉన్న వాస్తవాలేంటి..?

- Advertisement -

జార్ఖండ్‌లోని చైబాసా సదర్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. తలసేమియాతో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారికి రక్తమార్పిడి చేయగా, ఆ బిడ్డకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డకు ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బందే హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి వైద్య బృందాన్ని విచారణ కోసం రంగంలోకి దించింది.
విచారణ చేపట్టిన వైద్య బృందానికి దిగ్భ్రాంతికర వాస్తవాలు తెలిశాయి. అదే ఆసుపత్రిలో తరచూ రక్తమార్పిడి చేయించుకుంటున్న మరో నలుగురు తలసేమియా బాధితులకు కూడా హెచ్ఐవీ సోకినట్లు శనివారం నాటి పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.

విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు : ప్రాథమిక విచారణలో బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తు బృందం ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌తో పాటు, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఈ క్రమంలో రక్త నమూనాల పరీక్ష, రికార్డుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల పాటింపులో అనేక అక్రమాలు, నిర్లక్ష్యాలు ఉన్నట్లు తేలింది. కలుషితమైన రక్తాన్నే తలసేమియా రోగికి ఎక్కించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని, బ్లడ్ బ్యాంక్‌లో గుర్తించిన సమస్యలను సరిదిద్దాలని అధికారులను ఆదేశించామని డాక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.

అయితే, జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్ మాఝీ మాట్లాడుతూ, ఇన్‌ఫెక్షన్ కేవలం రక్త మార్పిడి వల్లే సోకిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని, కలుషితమైన సూదుల వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్ఐవీ వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వ్యక్తిగత కక్షల కోణం : ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాధితుల్లో ఒక బాలుడి బంధువుకు, బ్లడ్ బ్యాంక్ సిబ్బందిలో ఒకరికి మధ్య గత ఏడాదిగా కోర్టులో కేసు నడుస్తోందని, ఈ విద్వేషమే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని మంజహరి జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఆరోపించడం గమనార్హం.

సుమోటోగా స్వీకరించిన హైకోర్టు : ఈ అమానవీయ ఘటనపై జార్ఖండ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిని, జిల్లా సివిల్ సర్జన్‌ను ఆదేశించింది. అధికారిక లెక్కల ప్రకారం, పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ప్రస్తుతం 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 మంది తలసేమియా రోగులు ఉన్నారు. ప్రభుత్వం అప్రమత్తమై, సంబంధిత రక్త దాతలను గుర్తించి, వారి నమూనాలను తిరిగి పరీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad