Jharkhand’s vegetarian village : ఆధునిక ప్రపంచంలో మాంసాహారం వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ, ఈ గందరగోళానికి దూరంగా, ఒక గ్రామం తరతరాలుగా సంపూర్ణ శాకాహార జీవన విధానాన్ని పాటిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఊరుకు ఊరే మాంసం ముట్టదంటే నమ్ముతారా? స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో గుడ్డుకు బదులుగా పండ్లు ఇస్తారంటే ఆశ్చర్యపోతారా? ఇది నిజం. ఝార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఉన్న ఆ విలక్షణ గ్రామం కథే ఇది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలేమిటి? వారి జీవన విధానం ఎలా ఉంటుంది? తెలుసుకుందాం పదండి.
గాంధీ వారసులు.. తానా భగత్ సమాజం : లతేహార్ జిల్లాలోని బార్వాగఢ్ గ్రామ ప్రజలందరూ సంపూర్ణ శాకాహారులు. ఇక్కడ మాంసం వండరు, తినరు, అమ్మరు. ఈ గ్రామంలో అత్యధికులు ‘తానా భగత్’ సమాజానికి చెందినవారు. వీరు జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలు, సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అహింస, సాత్విక జీవనం వారి సంప్రదాయంలో భాగం. అందుకే దశాబ్దాలుగా ఈ గ్రామస్థులు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. విచిత్రం ఏమిటంటే, లతేహార్ జిల్లా రుచికరమైన ‘ఖాసీ’ మేకలకు ప్రసిద్ధి. చుట్టుపక్కల ప్రాంతాల్లో మాంసానికి విపరీతమైన గిరాకీ ఉన్నప్పటికీ, బార్వాగఢ్ ప్రజలు మాత్రం తమ నియమాన్ని వీడరు.
ఆరోగ్యమే మహాభాగ్యం : “మా ఊరిలో స్వచ్ఛమైన, సాత్వికమైన ఆహారాన్నే తింటాం. ఈ సంప్రదాయాన్ని మా పూర్వీకుల నుంచి కొనసాగిస్తున్నాం,” అని గ్రామస్థుడైన మంగార తానా భగత్ గర్వంగా చెబుతారు. “స్వచ్ఛమైన శాకాహారం తినడం వల్ల మేం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. మా గ్రామస్థులు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతారు. ఇంట్లో వండిన ఆహారాన్నే తింటాం. మా పిల్లలు కూడా బయటి తిండిని, రెస్టారెంట్ ఆహారాన్ని ముట్టుకోరు. అందుకే చిన్న చిన్న సీజనల్ జబ్బులు తప్ప, ఎవరూ పెద్ద రోగాల బారిన పడరు,” అని ఆయన వివరించారు.
బడిలోనూ అదే బాట : గ్రామస్థుల జీవన విధానం వారి పిల్లలపై, పాఠశాలపై కూడా ప్రభావం చూపుతుంది. బార్వాగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు గుడ్డుకు బదులుగా అరటిపండు లేదా ఇతర పండ్లను అందిస్తారు. “మా పాఠశాలలోని అత్యధిక పిల్లలు తానా భగత్ సమాజానికి చెందినవారే. వారు గుడ్లు తినరు. గుడ్లు తినని పిల్లలకు ప్రత్యామ్నాయంగా పండ్లు ఇవ్వాలని ప్రభుత్వ షరతు కూడా ఉంది. అందుకే మేము వారికి పండ్లనే అందిస్తాం,” అని పాఠశాల ఉపాధ్యాయుడు అభిషేక్ తెలిపారు.
వైద్యులు ఏమంటున్నారు : శాకాహారమే ఉత్తమ ఆహారమని, ఇది సులభంగా జీర్ణమవుతుందని లతేహార్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అఖిలేశ్వర్ ప్రసాద్ అన్నారు. “మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్, కాలేయ, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శాకాహారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


