SBI branch robbery Karnataka : మిలిటరీ దుస్తుల్లో వచ్చారు.. తుపాకులతో బెదిరించారు.. సిబ్బందిని కట్టేసి, స్ట్రాంగ్ రూమ్‌ను కొల్లగొట్టారు! కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మరోసారి భారీ బ్యాంక్ దోపిడీ కలకలం రేపింది. నాలుగు నెలల క్రితం జరిగిన కెనరా బ్యాంక్ దోపిడీ ఘటన మరవకముందే, ఇప్పుడు చడ్చనా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను లక్ష్యంగా చేసుకుని, దుండగులు సుమారు 50 కిలోల బంగారం, రూ.8 కోట్ల నగదుతో ఉడాయించారు. అసలు ఈ సినీఫక్కీ దోపిడీ ఎలా జరిగింది..? పోలీసుల ముందున్న సవాళ్లేంటి..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం ఈ దోపిడీ జరిగింది.
సాయంత్రం 6:30 గంటలకు..: బ్యాంకు మూసివేసే సమయంలో, ముసుగులు ధరించిన దుండగులు మిలిటరీ యూనిఫామ్‌ను పోలిన దుస్తులతో బ్యాంకులోకి ప్రవేశించారు.
తుపాకులతో బెదిరింపు: నాటు తుపాకులు, ఇతర పదునైన ఆయుధాలతో మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిపై దాడి చేసి, వారిని బెదిరించారు. అలారం బెల్ నొక్కకుండా అడ్డుకున్నారు. అనంతరం, సిబ్బంది అందరినీ కట్టేసి, వారి నుంచి స్ట్రాంగ్ రూమ్ వివరాలు తెలుసుకున్నారు.
భారీ దోపిడీ: స్ట్రాంగ్ రూమ్‌లోని సుమారు 50 కిలోల బంగారం, రూ.8 కోట్ల నగదును సంచుల్లో నింపుకుని, పంధర్‌పూర్ ప్రాంతానికి చెందిన కారులో పరారయ్యారు.
మహారాష్ట్రకు పారిపోయారా : సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయపుర ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి నేరుగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం: డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
పక్కా ప్లాన్‌తోనే: దొంగలు పక్కా ప్రణాళికతో, బ్యాంకు పనివేళలు, స్ట్రాంగ్ రూమ్ వివరాలు తెలుసుకుని మరీ ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర సరిహద్దులో గాలింపు: చడ్చనా పట్టణం మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, దొంగలు హులజంతి మార్గం ద్వారా అక్కడికి పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వారి కోసం కర్ణాటక, మహారాష్ట్ర పోలీసు బృందాలు సంయుక్తంగా భారీ గాలింపు చర్యలు చేపట్టాయి.
నాలుగు నెలల్లో రెండో భారీ దోపిడీ : విజయపుర జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇది రెండో భారీ బ్యాంక్ దోపిడీ కావడం గమనార్హం. ఈ ఏడాది మే నెలలో, జిల్లాలోని కెనరా బ్యాంక్‌లో దొంగలు 58 కిలోల బంగారం, రూ.5.2 లక్షల నగదును దోచుకెళ్లారు. ఆ కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే, ఇప్పుడు ఎస్‌బీఐలో ఇంతటి భారీ దోపిడీ జరగడం, పోలీసుల పనితీరుపై, బ్యాంకుల భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.


