Kerala Congress controversial post on Bihar : రాజకీయాల్లో వ్యంగ్యం ఒక్కోసారి హద్దులు దాటి వివాదాలకు దారితీస్తుంది. కేరళ కాంగ్రెస్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ‘బీహార్, బీడీ రెండూ బితోనే మొదలవుతాయి’ అంటూ చేసిన ఓ పోలిక, భారతీయ జనతా పార్టీ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకీ, ఆ పోస్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి…? అది ఎందుకింత పెద్ద వివాదానికి దారితీసింది..?
వివాదానికి దారితీసిన జీఎస్టీ సంస్కరణ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పొగాకు ఉత్పత్తులను ‘చెడు వస్తువుల’ (Sin Goods) జాబితాలో చేర్చి, వాటిపై 40 శాతం పన్ను విధించింది. అయితే, ప్రత్యేకంగా ‘బిహార్ బీడీల’పై మాత్రం పన్నును 18 శాతానికి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ కేరళ కాంగ్రెస్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.
“చెడుగా చూడొద్దు”.. కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం : “బిహార్, బీడీ రెండూ ‘బీ’ అనే అక్షరంతోనే మొదలవుతాయి. వాటిని చెడు వస్తువులుగా చూడరాదు,” అంటూ కేరళ కాంగ్రెస్ తన పోస్ట్‌లో పేర్కొంది. బిహార్ బీడీలకు పన్ను తగ్గించడాన్ని, బిహార్ రాష్ట్రాన్ని కలుపుతూ చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్య బీజేపీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
భగ్గుమన్న బీజేపీ : కాంగ్రెస్ పోస్ట్‌పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది యావత్ బిహార్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు.
బీజేపీ ఫైర్: “ఇంతకుముందు ప్రధాని మోదీ తల్లిని అవమానించిన హస్తం పార్టీ, ఇప్పుడు ఏకంగా బిహార్ రాష్ట్రాన్నే బీడీతో పోల్చి అవమానించింది,” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ధ్వజమెత్తారు.
తేజస్వికి సవాల్: “కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్, ఈ అవమానాన్ని సమర్థిస్తారా? బిహార్ ప్రజలకు సమాధానం చెప్పాలి,” అంటూ పూనావాలా ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి, తీవ్ర విమర్శల నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ తమ వివాదాస్పద పోస్ట్‌ను ‘ఎక్స్’ నుంచి తొలగించింది. అయినప్పటికీ, ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే ఉంది. ఒక రాష్ట్రంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఎలా దారితీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.


