కేరళ సీఎస్ శారదా మురళీధరన్(Sarada Muraleedharan) శరీర రంగు గురించి రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. ‘‘నా రంగును నేను అంగీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నేను ఒక పోస్టు చేశాను. ఆ తర్వాత వచ్చిన కామెంట్లతో కాస్త కంగారుకు గురై.. దానిని తొలగించాను. అయితే నేను పేర్కొన్న అంశాలు చర్చించాల్సినవేనని నా శ్రేయాభిలాషులు చెప్పడంతో మళ్లీ తిరిగి షేర్ చేశాను’’ అని ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘ఒక సీనియర్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న భర్తతో పోలికలు తీసుకొచ్చారు. అదేదో సిగ్గుపడాల్సిన విషయం అన్నట్టు.. అది అసలు మంచి కాదన్నట్టు.. నా రంగు గురించి మాట్లాడారు. కానీ నలుపును ఎందుకు అవమానించాలి. అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. వర్షానికి మందు కనిపించే వాగ్దానం. సాయంత్రానికి సూచిక.. అసలు అది లేనిదెక్కడ. ఈ రంగు చిన్నప్పుడే నేను పెద్ద మాటలు పలికేలా చేసింది. మళ్లీ నన్ను తన గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా తీసుకురాగలవా అని నాలుగు సంవత్సరాల వయసులో నేను నా తల్లిని అడిగేంతలా.
ఆ రంగు ప్రభావం నాపై 50 ఏళ్లపాటు కొనసాగింది. నలుపునకు విలువ లేదనే భావనలో తెలుపు పట్ల ఆకర్షితురాలినయ్యా. దాని వల్ల నేను తక్కువ వ్యక్తిగా భావించా. కానీ నా పిల్లలు ఆ వర్ణం అద్భుతమని, అందమైనదని నేను గుర్తించేలా చేశారు’’ అంటూ వివరించారు. కాగా శారదా మురళీధరన్ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. కొద్దినెలల క్రితమే కేరళ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆమె భర్త స్థానంలో శారద చీఫ్ సెక్రటరీగా నియమితులవడం విశేషం.