Saturday, November 15, 2025
Homeనేషనల్Drug awareness : డ్రగ్స్‌పై కళాస్త్రం: ఖాకీ చొక్కాలో కళాకారుడు.. ఒట్టన్ తుల్లాల్‌తో అవగాహన యాత్ర!

Drug awareness : డ్రగ్స్‌పై కళాస్త్రం: ఖాకీ చొక్కాలో కళాకారుడు.. ఒట్టన్ తుల్లాల్‌తో అవగాహన యాత్ర!

Ottan Thullal anti-drug awareness campaign : సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలనే మత్తు రక్కసిపై ఓ ప్రభుత్వ అధికారి తన విధి నిర్వహణలో భాగంగా వినూత్న సమరం చేస్తున్నారు. యువత భవితను చిదిమేస్తున్న డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టేందుకు ఆయన ఎంచుకున్న మార్గం రోటీన్‌కు భిన్నం. ఉపన్యాసాలు, కరపత్రాలకు బదులుగా కేరళ ప్రాచీన జానపద కళారూపమైన ‘ఒట్టన్ తుల్లాల్’ను అస్త్రంగా మలిచారు. ఆయనే అసిస్టెంట్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయరాజ్. ఏడేళ్లుగా ఏకధాటిగా 654 ప్రదర్శనలతో సమాజంలో చైతన్యం రగిలిస్తున్న ఈ ఖాకీ కళాకారుడి ప్రస్థానం ఎందరికో ఆదర్శం. 

- Advertisement -

ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు కళారూపమే వారధి : ఒట్టన్ తుల్లాల్ అనేది కేవలం ఒక నృత్యం కాదు, అదొక శక్తివంతమైన సామాజిక వ్యాఖ్యానం. నృత్యం, సంగీతం, కథనం మేళవించి సామాజిక రుగ్మతలను హాస్యభరితంగా, వ్యంగ్యంగా విమర్శించే ఈ ఏకపాత్రాభినయ కళకు కేరళలో విశేష ప్రాచుర్యం ఉంది. అందుకే, పొడిపొడి మాటలతో చెప్పేకంటే, కళతో చెబితే విషయం సూటిగా ప్రజల హృదయాల్లోకి వెళ్తుందని జయరాజ్ బలంగా విశ్వసించారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనారోగ్య, కుటుంబ, చట్టపరమైన సమస్యలను వివరిస్తూ ఆయనే స్వయంగా ఒట్టన్ తుల్లాల్‌కు అనుగుణంగా ఒక పాటను రచించారు. ఆయన ప్రదర్శనలకు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఉద్యోగ బాధ్యత.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం : నిజానికి, ఈ వినూత్న ప్రచారానికి బీజం వేసింది కేరళ ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లాలంటే, ఒక ఎక్సైజ్ అధికారే కళాకారుడిగా మారితే బాగుంటుందని భావించింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు, సహోద్యోగుల ప్రోత్సాహంతో జయరాజ్ ఈ బృహత్తర బాధ్యతను స్వీకరించారు. సుదీర్ఘ అధ్యయనం, కఠోర శిక్షణ అవసరమైన ఒట్టన్ తుల్లాల్‌ను, గురువు వాయలార్ సంతోశ్ వద్ద కేవలం కొద్ది రోజుల్లోనే ఔపోసన పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. “సామాజిక సమస్యలను సామాన్యులకు సైతం సరళంగా, వినోదాత్మకంగా చేరవేయడానికి ఒట్టన్ తుల్లాల్ ఒక అద్భుతమైన సాధనం. దాని సంప్రదాయ పద్ధతి చెడకుండా, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తున్నాను,” అని జయరాజ్ తెలిపారు.

ప్రదర్శన ప్రభావం.. కదిలించే అనుభవాలు : ఏడేళ్ల క్రితం ఎర్నాకులం జిల్లాలోని కళాశాల విద్యార్థులే లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రచారం, నేడు పాఠశాలల నుంచి పునరావాస కేంద్రాల వరకు విస్తరించింది. 20 నిమిషాల ఒట్టన్ తుల్లాల్ నృత్య ప్రదర్శన అనంతరం, అదే వేషధారణతో మరో 20 నిమిషాల పాటు అవగాహన తరగతి నిర్వహిస్తారు. యూనిఫామ్‌లో చెప్పే పాఠం కన్నా, ఈ పద్ధతి యువతపై బలమైన ముద్ర వేస్తోందని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

ఈ ప్రయాణంలో ఆయనకు ఎన్నో మరచిపోలేని అనుభవాలు ఎదురయ్యాయి. ఒక పాఠశాలలో ప్రదర్శన తర్వాత ఓ విద్యార్థిని వెక్కివెక్కి ఏడ్వడం గమనించిన ఉపాధ్యాయులు, ఆమెతో మాట్లాడగా, తన బంధువు ఒకరు కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడన్న దారుణ వాస్తవం బయటపడింది. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోసారి, మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో ప్రదర్శన చూసిన ఇద్దరు యువకులు, డ్రగ్స్‌కు బానిసలై తమ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ ఆ మహమ్మారి జోలికి వెళ్లబోమని అక్కడే ప్రతినబూనారు.

నిస్వార్థ సేవ.. శాఖ సంపూర్ణ మద్దతు : జయరాజ్ తన ప్రదర్శనలకు ఎలాంటి రుసుము తీసుకోరు. మేకప్ కూడా స్వయంగా వేసుకుంటారు. ప్రతి ప్రదర్శనతో తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. “నా ఉన్నతాధికారులు, సహచరులు అందిస్తున్న సంపూర్ణ మద్దతు వల్లే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను,” అని ఆయన వినమ్రంగా చెబుతారు. జయరాజ్ చేస్తున్న కృషికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, ఎక్సైజ్ శాఖ ఆయనకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయప్రకాశ్ తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని వయసుల వారిని సులభంగా చేరుతోందని మహిళా సివిల్ ఎక్సైజ్ అధికారిణి రంగీలా ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad