High-tech exam cheating : చొక్కాకు ఉండే బటన్ ఒక కెమెరాగా మారింది.. చెవిలో పెట్టుకున్న చిన్న పరికరం సమాధానాలు గుసగుసలాడింది.. బయట ఉన్న స్నేహితుడు లైవ్‌లో జవాబులు చెబుతుంటే, లోపల అభ్యర్థి పరీక్ష రాస్తున్నాడు. సినిమా కథను తలపించే ఈ హైటెక్ కాపీయింగ్ దందా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) నిర్వహించిన సెక్రటేరియట్ అసిస్టెంట్ పరీక్షలో బట్టబయలైంది. అధికారుల కళ్లుగప్పి అత్యాధునిక సాంకేతికతతో అక్రమానికి పాల్పడిన ఓ అభ్యర్థి గుట్టును పీఎస్సీ విజిలెన్స్ బృందం రట్టు చేసింది. అసలు ఈ హైటెక్ మోసం ఎలా సాగింది? నిందితుడిని ఎలా పట్టుకున్నారు? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు?
అనుమానం.. తనిఖీ.. అడ్డంగా బుక్ : కన్నూర్ జిల్లా పెరలసెర్రీకి చెందిన ఎన్.పి. మహ్మద్ సహద్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష రాస్తున్నాడు. అయితే, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఇన్విజిలేటర్లు పీఎస్సీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు సహద్‌ను తనిఖీ చేయగా అసలు బాగోతం బయటపడింది.
మోసం చేసిన తీరు ఇది.
బటన్ కెమెరా: సహద్ తన చొక్కా బటన్ స్థానంలో అతి సూక్ష్మమైన కెమెరాను అమర్చుకున్నాడు. ఇది పైకి సాధారణ బటన్‌లాగే కనిపిస్తుంది.
లైవ్ స్కానింగ్: ఈ కెమెరా సాయంతో ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి, రియల్ టైంలో బయట ఉన్న తన స్నేహితుడికి పంపించాడు.
బ్లూటూత్ సాయం: బయట ఉన్న స్నేహితుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు కనుగొని, సహద్ చెవిలో పెట్టుకున్న అతి చిన్న బ్లూటూత్ ఇయర్‌పీస్ ద్వారా లైవ్‌లో చేరవేశాడు.
ప్రత్యేక జేబు: ఈ కమ్యూనికేషన్‌కు అంతరాయం కలగకుండా, ప్రత్యేకంగా రూపొందించిన జేబులో మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టాడు.
ఈ పకడ్బందీ ఏర్పాట్లను చూసి అధికారులే నివ్వెరపోయారు. వెంటనే సహద్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాత పరీక్షలపైనా విచారణ : ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహద్ గతంలో రాసిన పరీక్షలపైనా విచారణ చేపట్టారు. ఆగస్టు 30న రాసిన ఎస్ఐ పరీక్ష సహా మరో నాలుగు పరీక్షల్లోనూ ఇదే తరహా మోసానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ నేరంలో అతనికి సహకరించిన స్నేహితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేరం రుజువైతే సహద్‌పై పదేళ్ల పాటు పీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధం విధించడంతో పాటు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇస్రో పరీక్షల్లోనూ ఇదే తరహా మోసం : కేరళలో ఇలాంటి హైటెక్ కాపీయింగ్ వెలుగుచూడటం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం ‘విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం’ (VSSC) ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలోనూ కొందరు ఇదే పంథాను అనుసరించారు. కెమెరా లెన్స్‌లు కనిపించకుండా దుస్తులను ప్రత్యేకంగా కుట్టించుకుని, బటన్ కెమెరాలతో ప్రశ్నలను బయటకు పంపి, ఇయర్‌పీస్‌లతో సమాధానాలు విని పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో పట్టుబడిన వారు పక్కా ప్రణాళికతో, పలుమార్లు ఇలాంటి మోసాలకు పాల్పడిన అనుభవజ్ఞుల్లా ఉన్నారని అధికారులు అప్పట్లో అభిప్రాయపడ్డారు.


