Kharge questions Rajya Sabha chair : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో అధికార పక్షంలో కలకలం రేపారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ను ఉద్దేశించి, “ఈ సభను నడిపిస్తున్నది మీరా లేక కేంద్ర హోంమంత్రి అమిత్ షానా..?” అంటూ ఆయన సంధించిన సూటి ప్రశ్నతో సభ దద్దరిల్లింది. ఇంతకీ ఖర్గే అంత తీవ్రంగా స్పందించడానికి కారణమేంటి..?
ఛైర్‌ను ఉద్దేశించి సూటి ప్రశ్న : పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా విపక్షాల నిరసనలతో రాజ్యసభ దద్దరిల్లుతున్న వేళ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సభలో అల్లరి చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే అని మన పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నాను, ఈ రాజ్యసభను నడిపేది ఎవరు..? మీరా..? లేక అమిత్ షానా..?” అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
సీఐఎస్ఎఫ్ బలగాలపై అభ్యంతరం : ఖర్గే ఆగ్రహానికి ప్రధాన కారణం.. విపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో సభలోకి సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఇతర భద్రతా బలగాలు ప్రవేశించడమే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖర్గే, డిప్యూటీ ఛైర్మన్‌కు ఒక లేఖ కూడా రాశారు. “సభ్యులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, సభలోకి సీఐఎస్ఎఫ్ బలగాలను పంపడాన్ని చూసి మేము దిగ్భ్రాంతికి గురయ్యాం” అని ఆ లేఖలో పేర్కొన్నారు. మంగళవారం ఇదే అంశాన్ని సభలో లేవనెత్తిన ఆయన, మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను కాలరాస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం ప్రతిదాడి : ఖర్గే ఆరోపణలను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తీవ్రంగా ఖండించారు. ఖర్గే పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాజ్యసభలోకి సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రవేశించలేదని, కేవలం మార్షల్స్‌కు మాత్రమే లోపలికి వచ్చే అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఛైర్మన్‌కు మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఖర్గే ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, సభలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “ప్రతిపక్ష నేత, ఛైర్మన్‌కు తప్పుడు లేఖ రాసి, పార్లమెంటులో అసత్య ప్రకటనలు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలి” అని రిజిజు నిలదీశారు.
జులై 21న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు మొదటి నుంచి గందరగోళం మధ్యే సాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి కొన్ని అంశాలపై క్లుప్త చర్చలు మినహా, మిగతా అన్ని రోజులూ విపక్షాల నిరసనలు, వాయిదాలతోనే సభా సమయం వృథా అవుతోంది. ఈ క్రమంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.


