Kiren Rijiju On Rahul Gandhi’s leadership : హరియాణాలో బీజేపీ ‘ఓట్ల దొంగతనానికి’ పాల్పడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ చేసేవన్నీ అర్థం లేని ఆరోపణలని, సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తప్పుడు ఆరోపణలు.. ప్రజాస్వామ్యానికి అవమానం : రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరించిన కిరణ్ రిజిజు, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరుస్తోందని మండిపడ్డారు. “ఓటింగ్ ప్రక్రియతో సమస్య ఉంటే ఎన్నికల సంఘానికి, ఆ తర్వాత కోర్టుకు వెళ్లాలి. కానీ వారు అలా చేయకుండా కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి, మన సంస్థలను అవమానిస్తున్నారు. బిహార్‌లో పోలింగ్ జరుగుతుంటే, ఈయన ఇంకా హరియాణా గురించి కథలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు,” అని రిజిజు విమర్శించారు.
విదేశీ యాత్రలు.. కట్టుకథలు : రాహుల్ గాంధీ తీరును ఎద్దేవా చేసిన రిజిజు, ఆయన విదేశీ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఎన్నికల సమయంలో ప్రజల మధ్య ఉండకుండా ఆయన కంబోడియా, థాయ్‌లాండ్, కొలంబియా వంటి దేశాలకు రహస్యంగా వెళ్తారు. అక్కడి నుంచి కొన్ని వింత ఆలోచనలు తెచ్చి, తన బృందానికి ఇస్తే, వారు ఇలాంటి నిరాధారమైన కథనాలను సిద్ధం చేస్తారు. హరియాణా ఎన్నికల్లో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు 22 ఓట్లు ఉన్నాయంటూ ఓ విదేశీ మహిళ పేరును కూడా ప్రస్తావించారు. పార్టీ ఓడిపోయాక మాత్రం ఇలా ఏడుస్తారు,” అని రిజిజు అన్నారు.
సొంత నేతలే నమ్మరు : రాహుల్ నాయకత్వాన్ని ఆయన సొంత పార్టీ నేతలే విశ్వసించడం లేదని రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరియాణా ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ గెలవదని ఆ పార్టీ నాయకురాలు కుమారి సెల్జా అన్నారని గుర్తుచేశారు. మూడు రోజుల క్రితం, ఓ మాజీ మంత్రి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ, సొంత పార్టీ గెలవదని ప్రకటించారని తెలిపారు. పార్టీలో సమన్వయం లేదని హరియాణా కాంగ్రెస్ అధిపతి రావు నరేంద్ర సింగ్ స్వయంగా అంగీకరించారని పేర్కొన్నారు.
“రాహుల్ గాంధీ తమ నాయకుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ గెలవదని చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాతో ప్రైవేట్‌గా కలిసి తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సొంత నాయకులే తమ వల్లే ఓడిపోతున్నామని ఒప్పుకుంటున్నప్పుడు, రాహుల్ చేస్తున్న ఈ ఆరోపణలను ఎవరు నమ్ముతారు?”
– కిరణ్ రిజిజు, కేంద్రమంత్రి
పదే పదే ఓడిపోతున్నా కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోవడం లేదని, రాహుల్ గాంధీ ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోరని రిజిజు విమర్శించారు.


