Terrorist Neutralized in Operation ఆకలి : జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అడవిలో ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంతకీ ఏమిటీ ఆపరేషన్ అఖల్…? బలగాలకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం ఎలా అందింది..?
కుల్గాంలో కొనసాగుతున్న ఆపరేషన్ అఖల్ : దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే కచ్చితమైన సమాచారంతో, భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సంయుక్తంగా శుక్రవారం గాలింపు చర్యలు ప్రారంభించాయి.
బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగా, మాటువేసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే ఎదురుకాల్పులు జరిపాయి. రాత్రంతా ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగాయని, బలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఉగ్రవాదుల కదలికలను నియంత్రించాయని చినార్ కార్ప్స్ తెలిపింది. శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, అతనిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.ఆపరేషన్ ఇంకా ముగియలేదని, అటవీ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు దాగి ఉండే అవకాశం ఉన్నందున గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చినార్ కార్ప్స్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది.
లోయలో ఉగ్రవాద ఏరివేత ముమ్మరం : కాశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను వేగవంతం చేశాయి. ఈ వారంలో ఇది మూడవ ఎన్‌కౌంటర్ అని, ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం శ్రీనగర్ సమీపంలో జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్ కూడా ఉన్నాడు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ నుంచి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను గురువారం భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తాజా ఘటనతో లోయలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


