Best LIC Policies 2025 : మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, మన పదవీ విరమణ జీవితం.. ఇలాంటి ఆలోచనలు మనందరినీ ఏదో ఒక దశలో కలవరపెడతాయి. మన కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకుంటే భద్రంగా ఉంటుంది..? తక్కువ రిస్క్‌తో మెరుగైన ప్రతిఫలం ఎలా పొందాలి..? ఈ ప్రశ్నలకు సమాధానంగా, కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). కేవలం పొదుపు మాత్రమే కాదు, జీవితానికి భీమా కల్పిస్తూ, మన డబ్బుకు రెట్టింపు భరోసా ఇచ్చే ఎల్ఐసీ టాప్ 5 పాలసీలు ఏవి..? వాటి ప్రత్యేకతలు ఏంటి..? ఏ పాలసీ ఎవరికి సరిగ్గా సరిపోతుంది..?
మీ అవసరానికి తగిన పాలసీ ఇదే!
భద్రత, రాబడి, జీవిత భీమా అనే మూడు ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎల్ఐసీ అందిస్తున్న ఐదు అత్యుత్తమ పాలసీలను వివరంగా పరిశీలిద్దాం.
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ (LIC Jeevan Anand): తక్కువ బడ్జెట్‌లో జీవితాంతం భీమా రక్షణ కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది ఎండోమెంట్, హోల్ లైఫ్ ప్లాన్‌ల కలయిక. ఉదాహరణకు, మీరు రోజుకు సుమారు రూ. 45 (నెలకు రూ. 1358) పొదుపు చేయడం ద్వారా, 35 ఏళ్ల పాలసీ వ్యవధి ముగిసేనాటికి రూ. 25 లక్షల వరకు పొందవచ్చు. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే, మెచ్యూరిటీ తర్వాత పూర్తి మొత్తం అందుకున్నప్పటికీ, పాలసీదారు జీవించి ఉన్నంతకాలం భీమా రక్షణ కొనసాగుతుంది. పాలసీదారు మరణించిన తర్వాత నామినీకి అదనపు హామీ మొత్తం లభిస్తుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక చక్కటి ఎంపిక.
ఎల్ఐసీ జీవన్ శిరోమణి (LIC Jeevan Shiromani): అధిక ఆదాయ వర్గాల కోసం
అధిక ఆదాయం కలిగి, పెద్ద మొత్తంలో బీమా రక్షణ, హామీతో కూడిన రాబడిని ఆశించే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్ ఇది. ఇది నాన్-లింక్డ్, మనీ-బ్యాక్ జీవిత బీమా పథకం. ఈ ప్లాన్‌లో కనీస బీమా మొత్తమే రూ. 1 కోటి వరకు ఉంటుంది. ఉదాహరణకు, 30 సంవత్సరాల వయసున్న వ్యక్తి 20 ఏళ్ల కాలపరిమితితో ఈ పాలసీ తీసుకుంటే, 16 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ కాలంలో నిర్దిష్ట సంవత్సరాల్లో (ఉదా: 16వ మరియు 18వ సంవత్సరం) సర్వైవల్ బెనిఫిట్ రూపంలో కొంత మొత్తం తిరిగి వస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మిగిలిన హామీ మొత్తం, బోనస్‌లతో కలిపి చెల్లిస్తారు.
ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్ (LIC New Endowment Plan): పెట్టుబడి, భద్రత కలయిక భీమా కన్నా పెట్టుబడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారికి ఈ ప్లాన్ అనువైనది. ఇందులో రిస్క్ చాలా తక్కువ, రాబడి స్థిరంగా ఉంటుంది. పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత హామీ మొత్తం (Sum Assured) తో పాటు, సంస్థ లాభాల ఆధారంగా సింపుల్ రివిజనరీ బోనస్‌లు, ఫైనల్ అడిషనల్ బోనస్ (FAB) లభిస్తాయి. ఇది మీ పొదుపును సురక్షితంగా పెంచుతూ, అదే సమయంలో మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.
ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ (LIC Jeevan Umang): జీవితాంతం ఆదాయం : పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. ఈ పథకంలో ప్రీమియం చెల్లించే కాలపరిమితి ముగిసిన తర్వాత, పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం (100 ఏళ్ల వయసు వరకు) ప్రతి ఏడాది హామీ మొత్తంలో 8% డబ్బును సర్వైవల్ బెనిఫిట్‌గా పొందుతారు. పాలసీదారు మరణించిన తర్వాత, నామినీకి పూర్తి బీమా కవరేజ్, బోనస్‌లు లభిస్తాయి. రిటైర్మెంట్ కోసం పక్కా ప్రణాళిక వేసుకునే వారికి ఇది అత్యంత ఉత్తమమైన ఛాయిస్.
ఎల్ఐసీ జీవన్ తరుణ్ (LIC Jeevan Tarun): పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా :
మీ పిల్లల ఉన్నత విద్య, వివాహం లేదా ఇతర ఆర్థిక అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ ఇది. ఈ పాలసీని పిల్లల పేరు మీద 0 నుంచి 12 ఏళ్ల వయసులో తీసుకోవచ్చు. పిల్లలకు 20 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి 24 ఏళ్ల వరకు ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని మనీ-బ్యాక్ రూపంలో పొందేలా నాలుగు వేర్వేరు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. 25 ఏళ్ల వయసులో మెచ్యూరిటీపై మిగిలిన హామీ మొత్తం, బోనస్‌లతో కలిపి ఒకేసారి లభిస్తుంది. పిల్లల భవిష్యత్తుకు ఆర్థికంగా బాటలు వేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది సరైన ఎంపిక.


