LPG gas cylinder insurance claim : వంటగ్యాస్.. మనకు ఎంత సౌకర్యమో, అప్రమత్తంగా లేకపోతే అంత ప్రమాదం. అనుకోని రీతిలో సిలిండర్ పేలితే, ఆ నష్టం వర్ణనాతీతం. అయితే, అలాంటి దురదృష్టకరమైన ఘటన జరిగినప్పుడు, బాధితులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఓ భరోసా ఉందని మీకు తెలుసా? అదీ మనం ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించకుండానే! ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై రూ.50 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం ఉంటుంది. కానీ, ఈ విషయంపై అవగాహన లేక, చాలామంది బాధితులు ఈ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. అసలు ఈ బీమా ఎలా వర్తిస్తుంది? పరిహారం కోసం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
ప్రతి కనెక్షన్‌పైనా ఉచిత బీమా : మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన క్షణం నుంచే, మీరు, మీ కుటుంబం ఈ బీమా పరిధిలోకి వస్తారు. ఇది వినియోగదారుడికి చమురు కంపెనీలు అందించే థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినప్పుడు, ప్రాణ, ఆస్తి నష్టాన్ని బట్టి ఈ బీమా వర్తిస్తుంది.
పరిహారం ఎంత వస్తుంది : ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం మొత్తం మారుతుంది.
ప్రాణ నష్టం: ప్రమాదంలో మరణం సంభవిస్తే, ఒక్కో వ్యక్తికి రూ.6 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా లభిస్తుంది.
గాయాలైతే: గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక్కో బాధితుడికి రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లిస్తారు.
ఆస్తి నష్టం: ప్రమాదంలో ఇల్లు, ఆస్తి నష్టపోతే, రూ.2 లక్షల వరకు పరిహారం అందుతుంది.
గరిష్ఠ పరిమితి: ఒకే ఘటనలో కుటుంబం మొత్తానికి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది.
క్లెయిమ్ చేసుకోవడం ఎలా : ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని కీలకమైన పనులు చేయాలి.
తక్షణమే సమాచారం: ప్రమాదం జరిగిన వెంటనే, మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, మీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్/ఏజెన్సీకి తప్పనిసరిగా సమాచారం అందించాలి. 1906 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కూడా ఫోన్ చేయవచ్చు.
విచారణ: మీ సమాచారం అందుకున్న డిస్ట్రిబ్యూటర్, సంబంధిత చమురు కంపెనీకి, బీమా సంస్థకు తెలియజేస్తారు. వారి ప్రతినిధులు వచ్చి, ప్రమాద స్థలాన్ని పరిశీలించి, విచారణ జరుపుతారు.
పత్రాల సమర్పణ: బీమా క్లెయిమ్ కోసం, మరణ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ మరణం సంభవిస్తే), పోస్టుమార్టం నివేదిక, చికిత్సకు సంబంధించిన అన్ని మెడికల్ బిల్లులు, రశీదులను డిస్ట్రిబ్యూటర్‌కు సమర్పించాలి.
సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ ‘కోడ్’ చూడండి : డెలివరీ బాయ్ సిలిండర్ ఇచ్చేటప్పుడు, దాని పైభాగంలో ఉన్న రింగ్‌పై A-24, B-25 వంటి కోడ్‌ను తప్పకుండా గమనించండి. ఇది సిలిండర్ గడువు తేదీ.
A: జనవరి-మార్చి; B: ఏప్రిల్-జూన్; C: జులై-సెప్టెంబర్; D: అక్టోబర్-డిసెంబర్.
24, 25: ఇవి సంవత్సరాన్ని సూచిస్తాయి (ఉదా: 2024, 2025).
గడువు ముగిసిన సిలిండర్లను తీసుకోవడానికి నిరాకరించడం మీ హక్కు, మీ భద్రత.


