Lucknow UNESCO Creative City of Gastronomy : నవాబుల నగరంగా, గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచే లక్నో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రాజవంశీయుల వంటశాలల నుంచి వీధి వీధిలో ఘుమఘుమలాడే కబాబుల వరకు.. శతాబ్దాల పాకశాస్త్ర వారసత్వానికి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), లక్నో నగరాన్ని ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’ (సృజనాత్మక పాకశాస్త్ర నగరం)గా అధికారికంగా ప్రకటించింది. ఇంతటి ప్రతిష్టాత్మక గౌరవం దక్కడం వెనుక ఉన్న ఘన చరిత్ర ఏమిటి? ఈ గుర్తింపుతో లక్నోకు కలిగే ప్రయోజనాలేంటి? ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా : ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన యునెస్కో 43వ సాధారణ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. మన దేశం నుంచి ఈ గౌరవాన్ని పొందిన రెండో నగరంగా లక్నో చరిత్ర సృష్టించింది. గతంలో, 2019లో హైదరాబాద్ నగరం ఈ ఘనతను సాధించిన విషయం తెలిసిందే. ఈ గుర్తింపు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. “లక్నో ఒక శక్తివంతమైన సంస్కృతికి పర్యాయపదం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు లక్నోను సందర్శించి దాని ప్రత్యేకతను అనుభూతి చెందాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ విజయం దేశ వారసత్వానికి దక్కిన గొప్ప గౌరవమని కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సంస్కృతి ప్రపంచ వేదికపై గౌరవాన్ని పొందుతోందని, ఈ గుర్తింపు పర్యాటకాన్ని ప్రోత్సహించి, అంతర్జాతీయ సహకారానికి కొత్త ద్వారాలు తెరుస్తుందని ఆయన పేర్కొన్నారు. నోరూరించే గలౌటీ కబాబ్‌లు, ప్రత్యేకమైన బిర్యానీ, షీర్మల్ వంటి వంటకాలతో లక్నో ఆహార ప్రియులను శతాబ్దాలుగా ఆకట్టుకుంటోంది. ఈ గుర్తింపుతో లక్నో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 408 ‘క్రియేటివ్ సిటీస్’ సరసన చేరింది.


