School trades education for waste : డబ్బు లేదని చదువుకు దూరం కావాలా? పుస్తకాలు, పెన్నులు కొనలేని పేదరికం ఆ చిన్నారుల కలలను చిదిమేయాలా? అక్షర జ్ఞానానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధం లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ తమ ఆచరణతో సమాధానం చెబుతోంది మధ్యప్రదేశ్‌లోని ఓ పాఠశాల. ‘చెత్తను మాకివ్వండి.. పుస్తకాలను మీకిస్తాం’ అంటూ సరికొత్త నినాదంతో మురికివాడల పిల్లల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగిస్తోంది.
ఆలోచనే ఆయుధంగా : మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడాలో ఉన్న ‘తర్బియాత్ వరల్డ్ ఉర్దూ, మల్టీ లాంగ్వేజ్ స్కూల్’ ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పాఠశాలలో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు విద్యాబోధన సాగుతోంది. సమీపంలోని మురికివాడల నుంచి ఎంతోమంది పిల్లలు ఇక్కడ చేరాలని ఆశపడినా, పుస్తకాలు కొనే స్థోమత లేక, ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు మానేసేవారు. కొందరైతే చెత్త ఏరుకుంటూ బాల కార్మికులుగా మారేవారు. ఈ దుస్థితిని గమనించిన పాఠశాల యాజమాన్యం, వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నడుం బిగించింది.
పాఠశాల ప్రిన్సిపాల్ ఆయేషా లూదీ మాటల్లో.. “పిల్లల తల్లిదండ్రులకు స్టేషనరీ, పుస్తకాలు కొనడం పెనుభారంగా మారింది. అందుకే చాలామంది పిల్లలను పనులకు పంపేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా, వారిని చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణతో అనుసంధానించాలని నిర్ణయించాం. ఇప్పుడు పిల్లలు ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, చిప్స్ ప్యాకెట్లు వంటి చెత్తను తీసుకొస్తే, దానికి బదులుగా వారికి పెన్నులు, పుస్తకాలు, నోటుబుక్కులు ఉచితంగా ఇస్తున్నాం.”
‘రీసైకిల్ నాలెడ్జ్ సెంటర్’.. సృజనకు చిరునామా : ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు పాఠశాల ఆవరణలోనే ‘రీసైకిల్ నాలెడ్జ్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. ఇది కేవలం చెత్తను తీసుకునే కేంద్రం కాదు, చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ప్రయోగశాల.
చెత్తకు ప్రతిఫలం: విద్యార్థులు 5 కిలోల ప్లాస్టిక్ చెత్త (సీసాలు, కవర్లు) తీసుకొచ్చి ఇస్తే, వారికి అవసరమైన పాఠశాల సామగ్రిని అందిస్తారు.
ఫీజు మాఫీ వరం: ఎవరైనా విద్యార్థి 5 కిలోల కంటే ఎక్కువ చెత్తతో ఏదైనా ఒక ప్రాజెక్ట్ (ఉపయోగకరమైన వస్తువు) తయారు చేసి చూపిస్తే, వారి ఆ ఏడాది స్కూల్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నారు. ఈ విధానం వల్ల పిల్లలు కేవలం చెత్తను సేకరించడమే కాకుండా, దాంతో కొత్త వస్తువులను ఎలా తయారు చేయవచ్చో నేర్చుకుంటున్నారు. వారిలో పరిశుభ్రతపై, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది.
నెరవేరుతున్న కలలు : పాఠశాల తీసుకున్న ఈ నిర్ణయంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. చెత్త ఏరుకునే చేతులు ఇప్పుడు పుస్తకాలు పడుతున్నాయి. ఫీజుల భారం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సంతోషంగా బడికి పంపుతున్నారు. పేదరికం శాపంగా భావించకుండా, తమ శ్రమతోనే చదువును గెలుచుకోవచ్చన్న ఆత్మవిశ్వాసం ఆ చిన్నారుల్లో వెల్లివిరుస్తోంది. ఒక మంచి బడిలో చదివి, ఉన్నత భవిష్యత్తును పొందాలన్న వారి కల ఈ వినూత్న ప్రయత్నం ద్వారా నెరవేరుతోంది.


