Friday, November 22, 2024
Homeనేషనల్TMC bizarre behaviour: దారి తప్పుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌

TMC bizarre behaviour: దారి తప్పుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌

రేషన్ కుంభకోణంలో ఈడీ విచారణకు వస్తే ఇలా ..

అహంకారం తలకెక్కిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇక అరాచకాలకు ఒడిగట్టడం ప్రారంభించారు. ఈ పార్టీ కూడా వెనుకటి వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వాల లాగే ఏది చేసినా చెల్లుబాటవుతుందనే అభిప్రాయంలోకి దిగిపోతోంది. కేందంతో కయ్యానికి కాలు దువ్వుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గూండాలు ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి) అధికారుల మీద తీవ్రస్థాయిలో దాడుల చేయడంతో పాటు, అందుకు సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శించడాన్ని బట్టి పశ్చిమ బెంగాల్‌ అరాచక ధోరణులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇ.డి అధికారుల మీద స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని బట్టి అక్కడి శాంతిభద్రతల యంత్రాంగం ఏ విధంగా పని చేస్తోందో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన కంటే గూండాగిరీకే అక్కడ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇ.డి అధికారులు లైంగిక దాడికి, దొంగతనానికి, అక్రమ ప్రవేశానికి పాల్పడ్డారని పోలీసులు ఇ.డి అధికారులపై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయడం జరిగింది. కోట్లాది రూపాయల రేషన్‌ అవినీతికి పాల్పడిన షాజహాన్‌ షేక్‌ అనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడి ఇంటి మీద ఇ.డి అధికారులు సి.ఆర్‌.పి దళ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆయన నివాసం 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ ఖాలీ అనే ప్రాంతంలో ఉంది.
ఇ.డి అధికారులు వచ్చినప్పటికీ ఆయన తలుపులు తెరవలేదు. పైగా కొద్ది క్షణాల్లోనే వందలాది మంది గూండాలు ఆయన ఇంటి ముందు చేరారు. వారందరి చేతుల్లోనూ ఆయుధాలున్నాయి. వారంతా ఒక్కుమ్మడిగా ఇ.డి అధికారుల మీదా, సి.ఆర్‌.పి సిబ్బంది మీదా దాడి చేశారు. చేతుల్లోని మొబైల్‌ ఫోన్లను, జేబుల్లోని పర్సులను లాక్కున్నారు. వారి దాడిలో ముగ్గురు ఇ.డి అధికారులు తీవ్ర గాయాలకు లోనై, ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. అంతేకాక, ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు కొందరు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఇ.డిని ఉపయోగించుకుంటోందని, దాని ధోరణిని ఈ విధంగానే అడ్డుకుంటామని వారు ప్రకటనలు చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వంతో సమస్య ఉన్నప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప రాళ్లు రప్పలతో ఎదుర్కోవడం సమంజసం కాదని మరికొన్ని వర్గాలు వాదిస్తున్నాయి.
మొత్తం మీద, ఈ గూండాలకు ఆదేశాలు జారీచేసిన వారు, వారిని ఇ.డి అధికారులపై దాడులకు ఉసిగొల్పినవారు ఇంకా ఎక్కడా బయటపడలేదు. అంతేకాదు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు ముందుగా తెలియజేయకుండా ఇ.డి దాడులు చేయడం వల్లే ఈ విధంగా జరిగిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు నిస్సిగ్గుగా ప్రకటనలు జారీచేయడం పుండు మీద కారం రాసిన చందంగా ఉంది. ఈ విధమైన అరాచక ధోరణులు కొనసాగే పక్షంలో ఇదివరకటి వామపక్ష కూటమి ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా జనాదరణ కోల్పోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇక ప్రత్యా మ్నాయం లేదనే అభిప్రాయంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ అనేక అఘాయిత్యాలకు, అరాచకాలకు పాల్పడుతోంది. అయితే, ఇటువంటి అభిప్రాయం మీద ఎక్కువ కాలం ఆధారపడ లేమనే విషయాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇ.డి అధికారుల మీద దాడి చేసిన గూండాలను అరెస్టు చేయడం, వారికి శిక్షపడేలా చేయడం తప్ప మమతా బెనర్జీకి మార్గం లేదు. చట్టాన్ని తన పని తాను చేసుకు పోనివ్వడమే మంచిది.
ఈ రేషన్‌ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి గతంలో పౌర సరఫరాల మంత్రిగా పనిచేసిన జ్యోతిప్రియ మల్లిక్‌. ఆయన అనుయాయే ఈ షాజహాన్‌ షేక్‌. ఇ.డి అధికారులు ఇదే కారణం మీద షాజహాన్‌ షేక్‌ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఆశ్చర్యకర విషయమే మిటంటే, కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన నిత్యావసరాలను ఈ ఇద్దరూ కలిసి పంచుకున్నారన్నది ఇ.డి ఆరోపణ. దాని మీద ప్రశ్నించడానికి ఇ.డి అధికారులు షాజహాన్‌ షేక్‌ ఇంటికి రావడం జరిగింది. పేదలకు పంపిణీ చేయాల్సిన నిత్యావసరాల్లో ప్రతి కిలో ధాన్యాన్ని 400 గ్రాముల చొప్పున తగ్గించి పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా మిగిలిన డబ్బును వారు పంచుకోవడం జరిగిందని ఇ.డి ఆరోపించింది. ఈ ఇద్దరూ కలిసి ఈ విధమైన అవినీతితో సుమారు రూ. 2,000 కోట్లు వెనకేసుకున్నారని, పైగా ఈ డబ్బును విదేశాలకు తరలించడం జరిగిందని ఇ.డి అధికారులు తెలిపారు. ఇందుకు ఇ.డి వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయి. కోవిడ్ సమయంలో ఈ ఇద్దరు నాయకులు పేదల కడుపు కొట్టడంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News