దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్యకేసు నిందితుడు అఫ్తాబ్ ను తీహార్ జైలుకు తరలిస్తుండగా.. అతడిపై కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బయట ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు పోలీసు వాహనాన్ని అడ్డగించి తల్వార్లతో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. అఫ్తాబ్ ను అక్కడి నుండి సురక్షితంగా తరలించారు.
కాగా.. అఫ్తాబ్ పై దాడికి ప్రయత్నించిన వారు హిందూసేన కార్యకర్తలుగా చెప్పుకున్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్ ను అఫ్తాబ్ మే 18న గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి వాటిని చాలారోజులు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాడు. ఆ తర్వాత వీలు చూసుకుని.. ఒక్కొక్కటిగా బాడీ పార్ట్స్ ను దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేశాడు. నవంబర్ 10న శ్రద్ధ కనిపించడం లేదంటూ ఆమె తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా రోజుకో షాకింగ్ విషయం బయటికొచ్చింది.