ప్రధానమంత్రిగా నరేంద్ర మోడిని ఏకగ్రీవంగా ఎంచుకుని, ఈమేరకు తీర్మానం చేసాయి ఎన్డీఏ కూటమి పార్టీలు. ఈమేరకు ఎన్డీఏ కీలక భేటీ ఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో నేషనల్ డెమాక్రటిక్ అలయన్స్ భేటీ పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగింది.
మీ అందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుందని ప్రధాని మోడీ ఈ కూటమి భేటీలో పేర్కొనటం విశేషం. విధాన నిర్ణయాల్లో సారూప్యత తెచ్చే ప్రయత్నం చేస్తామని మోడీ ఈ సందర్భంగా కూటమి పార్టీలకు హామీ ఇచ్చారు. గుడ్ గవర్నెన్స్ తమందరినీ కలిపిందని ఆయన వెల్లడించారు.
రానున్న 10 ఏళ్లలో వికాసం, గుడ్ గవర్నెన్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, సభ్యులంతా సమానమే అంటూ సరికొత్త రాజకీయ సమీకరణాలను మోడీ తన ప్రసంగంలో నొక్కి వక్కాణించారు. మినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమం గవర్నెన్స్ అనే విషయాన్ని ఎప్పటిలాగే పేర్కొన్నారు మోడీ.
ఎన్డీఏ తొలితరం నేతలను గుర్తుచేసుకున్నారు. వాజ్పేయి, బాదల్, థాకరే, ఫెర్నాండెజ్ వంటి వారిని తలుచుకున్నారు. ఎన్డీఏ ఓ ఆర్గానిక్ కూటమి అని ఆయన పదేపదే పేర్కొనటం విశేషం.
మరో 10 ఏళ్లు ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతుందని మోడీ విశ్వాసం వ్యక్తంచేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, కర్నాటకలో అప్పుడే ప్రజలు విసిగిపోయి, తమవైపు మొగ్గుచూపారన్నారు. తమిళనాడులో తాము సీట్లు గెలవకపోయినా, భవిష్యత్తు ఏంటనేది స్పష్టంగా కనిపిస్తూ తమ ఓటు షేరు గణనీయంగా పెరిగిందన్నారు. కేరళ, పుదుచ్చేరిలో కూడా సేమ్ సీన్ అన్నారు.
ఆయన పవన్ కాదు, తుపాను అంటూ మోడీ పవన్ కల్యాణ్ ను ఆకాశానికెత్తగా, పవన్ మోడీకి నమస్కారం చేశారు.
10 ఏళ్ల తరువాత కూడా కాంగ్రెస్ 100 సీట్ల మార్కు టచ్ చేయలేకపోయిందన్నారు మోడీ. నిన్న, నేడు, రేపు కూడా ఎన్డీఏనే అధికారంలో ఉందన్న విషయం ఇండీ కూటమికి అంతుచిక్కటం లేదన్నారు. దేశ ప్రజలకు కేవలం ఎన్డీఏపైన మాత్రమే విశ్వాసం ఉందన్నారు.
10 ఏళ్ల మా పాలన అంతా కేవలం ట్రేలర్ మాత్రమేనని, ఇది ఆయన కమిట్మెంట్ అన్నారు. దేశ ప్రజల ఆశలను క్షణమాత్రం ఆలస్యం చేయకుండా నెరవేర్చుతామన్నారు. న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియాగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగేలా తాము కర్తవ్యబద్ధులై నడుచుకుంటామన్నారు. ఇందుకు తమవద్ద రోడ్ మ్యాప్ కూడా సిద్ధంగా ఉందన్నారు మోడీ. అవినీతి రహిత, సంస్కరణలతో కూడిన సర్కారు తాము అందించామన్నారు. ఇండియా కూటమి అంటే కేవలం కుంభకోణాలని, కూటమి పేరు మార్చుకున్నా కుంభకోణాలు మాత్రమే ఇండి కూటమి ప్రత్యామ్నాయ పేరన్నది ప్రజలు గుర్తెరిగారన్నారు.