Congress criticizes Modi’s foreign policy : ఒకప్పుడు ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ అంటూ ఇద్దరు నేతలు ప్రదర్శించిన స్నేహబంధం ఇప్పుడు ఎండమావిలా మారింది. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అని నినదించిన చోట, నేడు ‘దోస్త్ దోస్త్ న రహా’ (స్నేహితుడు స్నేహితుడిగా లేడు) అనే విషాద గీతం వినిపిస్తోంది. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో, ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకీ ఆ ‘బ్రొమాన్స్’ ఎందుకు బెడిసికొట్టింది..? మోదీ వ్యక్తిగత దౌత్యం విఫలమైందా…? కేవలం పతాక శీర్షికల కోసమే విదేశాంగ విధానాన్ని నడిపించారా..? కాంగ్రెస్ ఆరోపణల పూర్తి వివరాలేంటి..?
‘సంగం’ పాటతో సెటైర్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ భారత్‌పై సుంకాలు వేస్తానంటూ బెదిరింపులు మొదలుపెట్టారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ మన కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య స్నేహం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఆయన పాత హిందీ సినిమా ‘సంగం’లోని “దోస్త్ దోస్త్ న రహా, ప్యార్ ప్యార్ న రహా” పాటను ఉటంకించారు.
“నాకు ఆ పాత ముకేశ్ పాటే గుర్తొస్తోంది. ట్రంప్‌తో మోదీ బంధం పూర్తిగా విఫలమైంది. 2019లో ‘హౌడీ మోదీ’, 2020లో ‘నమస్తే ట్రంప్’ అంటూ ఊదరగొట్టారు. ఏకంగా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అని నినాదమిచ్చారు. కొత్తగా ఎన్నికైన ట్రంప్‌ను కలిసిన తొలి దేశాధినేతల్లో మోదీ ఒకరు. కానీ ఇప్పుడా స్నేహం ఏమైంది?” అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
హెడ్‌లైన్స్ కోసమే విదేశాంగ విధానం : మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానమంతా కేవలం పతాక శీర్షికల వేట (హెడ్‌లైన్ హంటింగ్) కోసమేనని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. సంస్థాగతమైన దౌత్య ప్రక్రియలను పక్కనపెట్టి, ప్రధాని మోదీ దౌత్యాన్ని పూర్తిగా వ్యక్తిగతీకరించారని ఆయన ఆరోపించారు. “ఒకప్పుడు మన విదేశాంగ మంత్రి (ఎస్. జైశంకర్), ట్రంప్ ప్రమాణ స్వీకారానికి తనకు ముందు వరుసలో సీటు దొరికిందని గొప్పగా చెప్పుకున్నారు. అంటే, అంతా వీరి వ్యక్తిగత స్నేహంపైనే ఆధారపడి నడిచింది. కానీ వ్యవస్థీకృత దౌత్యానికి వ్యక్తిగత స్నేహాలు ప్రత్యామ్నాయం కావు. ఆ విషయం ఇప్పుడు రుజువైంది” అని రమేశ్ అన్నారు.
‘టాప్’ నుంచి ‘క్యాప్’ సవాళ్లు : జైరాం రమేశ్ ఇంకా మాట్లాడుతూ, “ఒకప్పుడు ప్రధాని మోదీ ‘టాప్’ (TOP – టమోటా, ఉల్లి, బంగాళాదుంప) ధరల గురించి మాట్లాడారు. కానీ ఆయన విధానాల వల్ల ఇప్పుడు దేశం ‘క్యాప్’ (CAP – చైనా, అమెరికా, పాకిస్థాన్) అనే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. చైనా, పాకిస్థాన్‌తో మనకు సవాళ్లు ఉన్నాయని తెలుసు. కానీ, అమెరికాతో కూడా మన సంబంధాలు ఇంత ఒత్తిడికి గురవుతాయని ఎవరు ఊహించారు..? ఇది మోదీ వ్యక్తిగత దౌత్య వైఫల్యమే” అని తీవ్రంగా విమర్శించారు.


