Modi Xi Jinping meeting : చైనాలోని తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. భారత్, చైనా పోటీదారులు కాదని, అభివృద్ధిలో భాగస్వాములని నేతలు అభిప్రాయపడ్డారు. అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారకూడదని, సరిహద్దుల్లో శాంతి కొనసాగాలని ఇరువురూ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ALSO READ: Balakrishna: వరద బాధితులకు బాలకృష్ణ అండ.. వరద సహాయ నిధికి భారీ విరాళం
2024 కజన్ సమావేశం తర్వాత సరిహద్దు సమస్యల్లో పురోగతి సాధించినట్లు నేతలు సమీక్షించారు. సైన్యాలు విజయవంతంగా వైదొలగడం, శాంతియుత వాతావరణం కొనసాగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు విమాన సర్వీసులు, వీసా విధానాలను సులభతరం చేయాలని నిర్ణయించారు. కైలాస మానససరోవర యాత్ర, పర్యాటక వీసాలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఈ చర్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆర్థిక, వాణిజ్య సంబంధాలపైనా లోతైన చర్చ జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడం, వాణిజ్య లోటును తగ్గించడంపై నేతలు అంగీకరించారు. “మన సంబంధాలను మూడో దేశం కోణంలో చూడకూడదు,” అని మోదీ స్పష్టం చేశారు. 2026లో భారత్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించగా, చైనా పూర్తి మద్దతు ఇస్తామని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు.
ఈ భేటీ భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. శాంతి, సహకారం, ఆర్థిక వృద్ధి దిశగా ఇరు దేశాలు ముందుకు సాగనున్నాయి.


