Mohanlal Indian Army Honour: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత ఆర్మీ నుంచి మరో సత్కారాన్ని అందుకున్నారు. సమాజానికి చేసిన విశేష సేవకు గాను, భారత సైన్యంతో నిరంతర ప్రమేయం, అంకితభావానికి గాను ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(COAS) కమెండేషన్’ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ సందర్భంగా మోహన్‌లాల్‌ను సత్కరించారు.

మే 2009లో మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను అందుకున్నారు. నాటి నుంచి సైన్యంతో అనుబంధం కలిగి ఉన్న ఆయన.. నిరంతరం సేవ, క్రమశిక్షణ, దేశభక్తి విలువలతో యూనిఫాం పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. ఆర్మీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2024లో వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు ఆహారం, మందులు అందించారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/naga-chaitanya-about-his-love-story-with-sobhita/
మోహన్‌లాల్ సినీ రంగంతో పాటు సమాజానికి కూడా విశిష్ట సేవలందించారు. ఆయన నెలకొల్పిన విశ్వశాంతి ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుంది. సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాజానికి తిరిగి ఇస్తూ భారతీయుడిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు.


