Sunday, November 16, 2025
Homeనేషనల్Mukesh Ambani: రూ.151 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ

Mukesh Ambani: రూ.151 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్షల కోట్ల రూపాయల ఆస్తితో ఆసియాలోనే అతి పెద్ద కుబేరుడిగా పేరు దక్కించుకున్నారు. అలాగే దాతృత్వంలోనూ ఆయన ముందుంటారు. ఇప్పటికే అనే ఛారిటీలు నడపడంతో పాటు ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన దాతృత్వం చర్చనీయాంశంగా మారింది.

తాను విద్యనభ్యసించిన ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ICT)కి ఏకంగా రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చని సూచించడం విశేషం. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ(MM Sharma) జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముకేశ్ అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విరాళం తన గురువు ప్రొఫెసర్ శర్మకు ఇచ్చే గురుదక్షిణ అని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ శర్మను ‘గురు ఆఫ్ భారత్’గా అభివర్ణిస్తూ, ఆయన సేవలకు గుర్తింపుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు మూడు గంటలకు పైగా ఐసీటీ ప్రాంగణంలో గడిపిన అంబానీ, ప్రొఫెసర్ శర్మతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ప్రొఫెసర్ శర్మ దార్శనికత వల్లే భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణలకు బీజం పడిందని అంబానీ అభిప్రాయపడ్డారు.

కాగా ముఖేశ్ అంబానీ 1970వ సంవత్సరంలో ఐసీటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఈ సంస్థను యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యూడీసీటీ)గా పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad