Women’s Safety in India: దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై జరిపిన సర్వేలో ముంబై, కోహిమాలు మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాలుగా నిలిచాయి. అదే సమయంలో, పట్నా, జైపూర్, ఢిల్లీ వంటి నగరాలు తక్కువ సురక్షితమైనవిగా నివేదికలో వెల్లడయ్యాయి. ‘నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ & ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ (NARI) 2025’ అనే నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
దేశవ్యాప్త భద్రత స్కోరు 65..
దేశంలోని 31 నగరాల్లో 12,770 మంది మహిళల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సర్వే రూపొందించబడింది. ఇందులో దేశవ్యాప్తంగా భద్రత స్కోరు 65 శాతంగా ఉంది. కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్, ముంబై నగరాలు అధిక స్కోరు సాధించాయి. ఈ నగరాల్లో లింగ సమానత్వం, పౌర భాగస్వామ్యం, మెరుగైన పోలీసు వ్యవస్థ, మహిళలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉండడం ఇందుకు కారణమని నివేదిక తెలిపింది.
తక్కువ సురక్షితమైనవి ఇవే..
పట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీ వంటి నగరాలు తక్కువ సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. ఇక్కడ సంస్థాగత ప్రతిస్పందన బలహీనంగా ఉండడం, పితృస్వామ్య భావనలు, మౌలిక సదుపాయాల లోపాలు ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
రాత్రి వేళ ఇంకా అభద్రతాభావం..
మొత్తం మీద, సర్వేలో పాల్గొన్న మహిళల్లో పది మందిలో ఆరుగురు తమ నగరాల్లో సురక్షితంగా ఉన్నామని భావించారు. అయితే, రాత్రి వేళల్లో, ముఖ్యంగా ప్రజా రవాణా, వినోద ప్రదేశాల్లో భద్రతా భావన బాగా తగ్గిందని తేలింది. మహిళలు సురక్షితంగా ఉన్నామని భావించినప్పటికీ, కేవలం మూడింట ఒక వంతు మంది మాత్రమే ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరిస్తారని నమ్ముతున్నారని నివేదిక వెల్లడించింది.
మహిళల భద్రత కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అది విద్య, ఆరోగ్యం, పని అవకాశాలు, స్వేచ్ఛ వంటి అనేక విషయాలపై ప్రభావం చూపుతుందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ తెలిపారు. సురక్షితమైన వాతావరణం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. సైబర్‌క్రైమ్, ఆర్థిక వివక్ష, మానసిక వేధింపుల నుంచి కూడా మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.


