మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూసింది. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి నానా పటోలే (Nana Patole) రాజీనామా చేసినట్లు వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ వార్తలపై నానా స్పందించారు. జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మహాయుతి కూటమి 233 స్థానాల్లో గెలిచి ఘన విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న మహావికాస్ అఘాడీ 51 సీట్లకే పరిమితమైంది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లోనే గెలిచింది. దీంతో కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజీనామా చేస్తున్నారని ప్రచారం మొదలవగా.. ఆయన ఈ వార్తలకి నానా పటోలే (Nana Patole) చెక్ పెట్టారు.