Saturday, November 15, 2025
Homeనేషనల్Neemuch Mandi : ఈ మార్కెట్లో మట్టికి - రాళ్లకు బేరం.. క్వింటాలుకు వేలల్లో ధర!

Neemuch Mandi : ఈ మార్కెట్లో మట్టికి – రాళ్లకు బేరం.. క్వింటాలుకు వేలల్లో ధర!

Neemuch medicinal market : మార్కెట్ అనగానే మన కళ్ల ముందు మెదిలేవి రంగురంగుల కూరగాయలు, పండ్లు, ధాన్యపు రాశులు. కానీ, మనం కనీసం కన్నెత్తి కూడా చూడని మట్టి, రాళ్లు, ఎండిపోయిన ఆకులను కూడా అమ్ముతారని మీకు తెలుసా..? అదీ క్వింటాలుకు వేల రూపాయల ధర పెట్టి మరీ పోటీపడి కొంటారని చెబితే నమ్ముతారా..? ఇది అబద్ధం కాదు, అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్‌లోని ఓ మార్కెట్‌లో పనికిరానివిగా మనం పక్కన పడేసే వాటికే బంగారమంత విలువ. ఇంతకీ ఆ వింత మార్కెట్ ఎక్కడుంది…? మట్టి, రాళ్లను అంత రేటు పెట్టి ఎందుకు కొంటారు..? ఈ వింత వ్యాపారం వెనుక ఉన్న ఆసక్తికర రహస్యమేంటి..?

- Advertisement -

పేరు నీమూచ్.. దేశంలోనే ప్రత్యేకం : మధ్యప్రదేశ్‌లోని నీమూచ్, దానికి సమీపంలో ఉన్న మాండ్‌సౌర్‌లోని పిపాలియాలో ఉన్న మార్కెట్ యార్డులు రాష్ట్రంలోనే అతిపెద్దవి. అయితే వీటి ప్రత్యేకత ధాన్యపు రాశులు కాదు, ఔషధ గుణాలే వీటికి అసలైన సంపద. ఇక్కడ సాధారణ పంటలు అమ్మరు, కొనరు. ఎండిన పూలు, ఆకులు, చెట్ల కొమ్మలు, వేర్లు, కలుపు మొక్కల విత్తనాలు, చివరికి మట్టి, రాళ్లను కూడా అమ్ముతారు. వినడానికి వింతగా ఉన్నా, ఈ ఉత్పత్తులకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది.

మట్టి, రాళ్లకు ఎందుకింత గిరాకీ : ఈ మార్కెట్‌లో రాళ్లను క్వింటాలుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు అమ్ముతారు. ఇక ఔషధ గుణాలున్న మట్టి అయితే క్వింటాలుకు రూ.500 నుంచి రూ.2000 వరకు పలుకుతుంది. నేల నాణ్యతను బట్టి దీని ధర నిర్ణయిస్తారు.
రాళ్ల రహస్యం: ఔషధ పంటల నిపుణుడు సంజయ్ ధకడ్ ప్రకారం, ఇక్కడ అమ్మే రాళ్లను ‘ఐరన్ రాయి’ లేదా ‘సిలికాన్ రాయి’ అని పిలుస్తారు. ఈ రాళ్లలో ఉండే సిలికాన్ డయాక్సైడ్‌ను చర్మం, జుట్టు, గోళ్లకు సంబంధించిన ఖరీదైన ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఫార్మా కంపెనీలు వీటిని మంచి ధరకు కొనుగోలు చేస్తాయి. ఇక్కడి మట్టిలో కూడా ప్రత్యేక ఔషధ గుణాలు ఉండటమే దాని అధిక ధరకు కారణం.

పనికిరానివి అనుకుంటే పొరపాటే : ఈ మార్కెట్‌లో అమ్ముడయ్యే వస్తువుల పేర్లు కూడా చాలా మందికి తెలియవని రైతు సత్యనారాయణ పాటిదార్ అంటారు. అడవుల్లో పెరిగే ఫువాడియా, అదాశిషి, ధాతుర వంటి కలుపు మొక్కల విత్తనాలకు కూడా ఇక్కడ మంచి ధర వస్తుంది. వేప ఆకులు, తుమ్మ కాయలు, మునగ, జామ ఆకులు, ఎండిన నిమ్మ, నారింజ తొక్కలు.. ఇలా ఒకటేమిటి, మనం పారేసే ప్రతి వస్తువూ ఇక్కడ విక్రయ వస్తువే.

ఈ ప్రాంత రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలిపెట్టి, 300 రకాల ఔషధ పంటలను పండిస్తూ లాభాల బాట పట్టారు. తులసి, అశ్వగంధ, సఫేద్ ముస్లి, కలోంజి వంటి పంటలను బంజరు భూముల్లో కూడా పండించి కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక కొనుగోలుదారులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి తరలివచ్చి ఈ ఉత్పత్తులను కొంటారు. అందుకే దేశంలో మరే మార్కెట్‌లోనూ దొరకని వస్తువులు నీమూచ్ మార్కెట్‌లో లభిస్తాయి. ఈ మార్కెట్ ప్రత్యేకతను చూడటానికి, ఇక్కడి ఉత్పత్తులను కొనడానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad