Sunday, November 16, 2025
Homeనేషనల్Delhi floods : ఉత్తరాదిపై వరుణుడి ఉగ్రరూపం: జలదిగ్బంధంలో రాజధాని!

Delhi floods : ఉత్తరాదిపై వరుణుడి ఉగ్రరూపం: జలదిగ్బంధంలో రాజధాని!

North India floods : ఉత్తర భారతం వరుణుడి ఉగ్రరూపానికి వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి వాగులు, వంకలు పొంగిపొర్లగా, జీవనదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ సహా జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు జల ప్రళయంతో అల్లాడిపోతున్నాయి. ప్రమాదపుటంచున ప్రవహిస్తున్న నదులతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 

- Advertisement -

జలదిగ్బంధంలో దేశ రాజధాని : దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. యమునా నది ప్రమాద స్థాయి అయిన 205.33 మీటర్లను దాటి, పాత రైల్వే వంతెన వద్ద ఏకంగా 207 మీటర్ల ఎత్తులో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద ఉద్ధృతికి నిగమ్‌బోధ్ ఘాట్‌, యమునా బజార్‌ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కాళింది కుంజ్‌, విశ్వకర్మ కాలనీ వంటి అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఓల్డ్ ఉస్మాన్‌పుర్‌, గడీ మాండూ గ్రామాల్లోని సుమారు 2,500 మందిని, వారి పెంపుడు జంతువులతో సహా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగగా, మరో 18 బృందాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా జల బీభత్సం : ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌: యూపీలో యమున, సరయూ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నోయిడాలోని పలు సెక్టార్లు నీట మునిగాయి. రాజస్థాన్‌లోనూ భారీ వర్షాలకు జైపుర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పంజాబ్‌, హరియాణా: ఈ రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పడవల ద్వారా సహాయక సామగ్రిని అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా మృతుల సంఖ్య 30కి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హరియాణాలో ఘగ్గర్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పంచ్‌కులలో పాఠశాల విద్యార్థులు వెళ్తున్న వాహనంపై చెట్టు విరిగిపడి పలువురు గాయపడ్డారు.

జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌: జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌లో చీనాబ్ నది మహోగ్రరూపం దాల్చడంతో గర్ఖాల్ గ్రామం నీట మునిగింది. వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఉధంపూర్‌లో కొండచరియలు విరిగిపడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పలుచోట్ల కొండచరియలు విరిగిపడి జనజీవనం స్తంభించింది.

ఛత్తీస్‌గఢ్‌లో డ్యామ్ కూలి పెను విషాదం : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపుర్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధనేష్‌పుర్ గ్రామంలో 1980వ దశకంలో నిర్మించిన లుత్తీ డ్యామ్‌ భారీ వర్షాలకు దెబ్బతిని, కొంత భాగం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా సంభవించిన ఆకస్మిక వరదల్లో ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కేంద్రాన్ని సాయం కోరిన రాహుల్ : వరద ప్రభావిత రాష్ట్రాల దుస్థితిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు తక్షణమే ప్రత్యేక సహాయక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తూ, పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad