50 kg plastic removed from cow stomach : ఆకలితో ఉన్న ఓ మూగజీవి కడుపు నిండా ఏముంటుంది? గడ్డి, నీళ్లు.. అనుకుంటే పొరపాటే. ఒడిశాలో ఓ గోమాత కడుపును కోసి చూసిన వైద్యులు నివ్వెరపోయారు. అందులో ఏకంగా 50 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల పర్వతం కనిపించింది! మనిషి నిర్లక్ష్యంగా పారేసిన ప్లాస్టిక్, ఓ నిస్సహాయ జీవి పాలిట ఎలా యమపాశంగా మారింది? ఈ హృదయవిదారక ఘటనకు దారితీసిన పరిస్థితులేంటి? అధికారుల నిషేధాజ్ఞలు ఎందుకు నీరుగారిపోతున్నాయి?
నొప్పితో నరకం.. స్పందించిన స్థానికులు: ఒడిశాలోని బ్రహ్మపుర పట్టణ వీధుల్లో తిరిగే ఓ ఆవు, కడుపు నింపుకోవడానికి దొరికినదాన్ని దొరికినట్లు తినేది. అందులో ఆహారంతో పాటు మనిషి పారేసిన ప్లాస్టిక్ కవర్లు, సంచులు కూడా ఉన్నాయి. కాలక్రమేణా ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు దాని కడుపులో పేరుకుపోయి, తీవ్ర అనారోగ్యానికి గురైంది. కడుపు నొప్పితో విలవిల్లాడుతూ రోడ్డుపై పడిఉన్న ఆవును చూసి చలించిన స్థానికులు, వెంటనే పశుసంరక్షణ హెల్ప్‌లైన్ నంబర్ 1962కు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స చేసి వెళ్లినా, ఆవు పరిస్థితి మెరుగుపడలేదు.
దీంతో స్థానికులు కార్పొరేటర్ సంజిత్ పాణిగ్రాహి, జంతు సంరక్షకులు లల్తేందు చౌదరీ దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో, ఆవును హుటాహుటిన పశువైద్యశాలకు తరలించారు.
వెలుగులోకి వచ్చిన విస్మయకర వాస్తవం : ఆవును పరీక్షించిన వైద్యులు, దాని కడుపులో ఏదో గట్టిపదార్థం పేరుకుపోయిందని గుర్తించి, శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. డాక్టర్ సత్యనారాయణ కార్ నేతృత్వంలోని వైద్య బృందం గంటల తరబడి శ్రమించి ఆపరేషన్ పూర్తి చేసింది. ఆవు పొట్టలోంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తున్న కొద్దీ వారికే కళ్లు బైర్లు కమ్మాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 కిలోల ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులను బయటకు తీశారు.
“కడుపు నొప్పితో బాధపడుతున్న ఆవుకు విజయవంతంగా ఆపరేషన్ చేశాం. ఇద్దరు వైద్యులు, ఆరుగురు సిబ్బంది కలిసి దాదాపు 50 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాం. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉంది,” అని డాక్టర్ సత్యనారాయణ కార్ తెలిపారు.
ఇది మామూలే.. అధికారుల హామీ : బ్రహ్మపురలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జులైలో కూడా మరో ఆవు కడుపులోంచి ఇలాగే కిలోల కొద్దీ ప్లాస్టిక్‌ను తొలగించారు. ఈ సమస్యపై స్పందించిన బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అశ్రీబాద్ బెహరా, “ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే ఒక ప్రచార కార్యక్రమం చేపడతాం. ప్లాస్టిక్ వాడకంపై వ్యాపారులతో సమావేశమై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని హామీ ఇచ్చారు.
కాగితాలకే పరిమితమైన నిషేధం : రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినప్పటికీ, అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఈ ఘటనే నిదర్శనం. నిషేధం కేవలం కాగితాలకే పరిమితమైందని, అధికారులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా మూగజీవాలు బలైపోతున్నాయని పర్యావరణవేత్తలు, స్థానికులు ఆరోపిస్తున్నారు.


