Two infants one oxygen cylinder : ఒకటే ఆక్సిజన్ సిలిండర్.. ఒకే పైపు.. దాని చివర ఇద్దరు పసికందులు. ఊపిరి తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్న ఆ పసిగుడ్లకు ప్రాణవాయువును పంచుతున్న ఈ దృశ్యం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇది వైద్యుల నిర్లక్ష్యమా.. సిబ్బంది అత్యుత్సాహమా..? లేక వసతుల కొరతా…? ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన వెనుక అసలేం జరిగింది..? అధికారుల స్పందన ఏంటి..?
దక్షిణ ఒడిశా ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న బెర్హంపుర్‌లోని మహారాజా కృష్ణచంద్ర గజపతి (ఎంకేసీజీ) మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సోమవారం ఈ దారుణ సంఘటన వెలుగుచూసింది. పీడియాట్రిక్ విభాగంలో చికిత్స పొందుతున్న ఇద్దరు నవజాత శిశువులకు ఈ దుస్థితి ఎదురైంది. పత్రాపుర్ బ్లాక్‌కు చెందిన కౌసల్య సాహుకు చెందిన 8 రోజుల శిశువు, గజపతి జిల్లాకు చెందిన పద్మాలయ బెహెరాకు చెందిన 14 రోజుల శిశువు శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నారు.
వైద్యులు ఆ చిన్నారులకు ఎకో కార్డియోగ్రామ్ (గుండె సంబంధిత) పరీక్ష చేయించాలని సూచించారు. దీంతో ఆ పసికందులను పీడియాట్రిక్ వార్డు నుంచి సూపర్ స్పెషాలిటీ భవనానికి తరలించాల్సి వచ్చింది. ఈ క్రమంలో, ఆసుపత్రి అటెండర్ ఒకే ఆక్సిజన్ సిలిండర్‌ను పట్టుకుని ముందు నడుస్తుండగా, ఆ సిలిండర్‌కు అమర్చిన ఒకే పైపు నుంచి ఇద్దరు శిశువులకు ఆక్సిజన్ అందిస్తూ వారి బంధువులు వెనుక నడిచారు. వారి వెంట ఒక వైద్యుడు కూడా ఉండటం గమనార్హం. ఆసుపత్రి ఆవరణలో ఈ దృశ్యం కనిపించడంతో అక్కడున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
విచారణ జరుపుతాం: ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా మాధవ్ శతపతి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. “ఆ ఇద్దరు చిన్నారుల ఆక్సిజన్ అవసరాలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. అయినప్పటికీ, ఒకే సిలిండర్‌తో ఇద్దరు రోగులకు ఆక్సిజన్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇలాంటివి పునరావృతం కావొద్దని సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేశాం” అని ఆయన తెలిపారు. పిల్లల వార్డులో తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, అయినా ఇలా ఎందుకు జరిగిందో విచారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, వసతులు ఉన్నప్పటికీ సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రోగుల బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రజలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.


