పహల్లాం ఉగ్రదాడి నేపథ్యంలో(Pahalgam Terror Attack) భారత్- పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోని మీడియాకు, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తతంఉన్నందున మీడియా కవరేజ్ విషయంలో పలు సూచనలు చేసింది. సోషల్ మీడియా యూజర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. రక్షణపరంగా ప్రభుత్వం తీసుకుంటున్న కీలకమైన చర్యల కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని హితవు పలికింది. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని ఆదేశించింది. ఈమేరకు పలు సూచనలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
“జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ అధికారులకు, ప్రభుత్వానికి చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయొద్దు” అని కేంద్రం సూచించింది.