PARLIAMENT: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెల 29 వరకు జరుగుతాయి. మొత్తం 23 రోజులపాటు జరిగే సమావేశాల్లో ఉభయసభలు 17 సార్లు భేటీ అవుతాయి.
ఈ సమావేశాల్లో 25 బిల్లుల్ని ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో 16 కొత్త బిల్లులు ఉన్నాయి. వీటిలో మూడు బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదింపజేయాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఇటీవల ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా కూడా కొనసాగుతారు.
ఆయన ఈ రోజు తొలిసారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ప్రసంగించారు. సామాన్య కుటుంబంలో జన్మించి, ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. గతంలో ఉప రాష్ట్రపతి న్యాయవాద వృత్తిలో పని చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. ఉప రాష్ట్రపతి ఇక్కడ కూడా కోర్టును మిస్ అవ్వరు అంటూ చమత్కరించారు.
అంటే పార్లమెంటులో కూడా న్యాయంవైపు నిలబడే అవకాశం ఉంటుందని ప్రస్తావించారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఇటీవల మరణించిన పార్లమెంటు మాజీ సభ్యులు సినీ నటుడు కృష్ణ, కృష్ణంరాజు, ములాయం సింగ్, తదితరులకు సభ నివాళులు అర్పించింది.