Plane Crash: ఎనిమిది మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న చిన్న విమానం కొలంబియాలోని రెండవ అతిపెద్ద నగరం మెడెలిన్‌లోని నివాస ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు సోమవారం ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమవగా మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు మరణించినట్లు సమాచారం. బెలెన్ రోసేల్స్ సెక్టార్లో ఈ విమాన ప్రమాదం జరిగింది. ప్రభుత్వ సామర్ధ్యం మేరకు బాధితులకు సాయం చేస్తున్నామని మేయర్ డేనియల్ క్వింటెరో ట్విట్టర్లో రాశారు.
మెడెలిన్ నుండి పక్కనే ఉన్న చోకో డిపార్ట్మెంట్లోని పిజారో మునిసిపాలిటీకి వెళ్లే విమానమే ఈ ట్విన్-ఇంజన్ పైపర్ అని క్వింటెరో చెప్పారు. విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని ట్విట్టర్లో రాశాయి. విమానం టేకాఫ్‌లో ఇంజిన్ వైఫల్యంతో ఒలాయా హెర్రెరా విమానాశ్రయానికి తిరిగి వెళ్లలేక కూలిపోయిందని క్వింటెరో చెప్పారు.
ఎమర్జెన్సీ సర్వీసెస్ షేర్ చేసిన చిత్రాల ప్రకారం విమానం ఒక ఇంటిపై కూలిపోయి పై అంతస్తులను ధ్వంసం చేసింది. చెల్లాచెదురుగా ఉన్న ఇల్లు, కూలిపోయిన ఇటుక గోడల మధ్య అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. అత్యవసర వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు సైరన్ల శబ్దంతో పాటు ఇళ్ళ పైన నల్లటి పొగ దట్టంగా ఎగసిపడుతున్నట్లు అతని ట్వీట్ వీడియోలో కనిపిస్తుంది. కాగా, మెడెలిన్ ఒక ఇరుకైన లోయలో ఉంది, దాని చుట్టూ ఆండీస్ పర్వతాలు ఉన్నాయి.