Sunday, November 16, 2025
Homeనేషనల్PM Modi: ట్రంప్​తో మాట్లాడేందుకు నేనూ వెయిట్ చేస్తున్నా.. భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తాం!

PM Modi: ట్రంప్​తో మాట్లాడేందుకు నేనూ వెయిట్ చేస్తున్నా.. భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తాం!

Modi Responds on Trump Comments: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ పోస్టుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన మిత్రుడైన మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ చెప్పడంతో.. మోదీ స్పందించారు. ట్రంప్‌తో మాట్లాడటానికి నేను కూడా ఎదురుచూస్తున్నానని తెలిపారు. భారత్‌- అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్‌ అని మోదీ పోస్ట్ చేశారు. తమ మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని అన్నారు.

- Advertisement -

భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తాం: రెండు దేశాలు సహజ భాగస్వాములని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల వాణిజ్య భాగస్వామ్యంలో లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించే ట్రేడ్‌ డీల్‌కు.. చర్చలు బాటలు పరుస్తాయనే విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ఇరుదేశాల బృందాలు కృషి చేస్తున్నాయని అన్నారు. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తామని మోదీ తెలిపారు.

ట్రంప్ ఓవైపు సుంకాలు విధిస్తూనే మరోవైపు..: భారత్​పై 50 శాతం సుంకాలు విధించాలనే ట్రంప్​ నిర్ణయం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల కొంతవరకు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కానీ ట్రంప్ ఓవైపు సుంకాలు విధిస్తూనే మరోవైపు ఇరుదేశాల సంబంధాలను ప్రశంసిస్తున్నారు. ట్రంప్ నరేంద్ర మోదీని ప్రశంసించడం ఇది రెండోసారి. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం.

మోదీ చైనా పర్యటనే ప్రధాన కారణం: ప్రధాని మోదీ ఇటీవలి చైనా పర్యటన అమెరికాపై తీవ్ర ప్రభావం పడిందనే చెప్పాలి. ఇప్పటికే మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసివున్న ఫొటోను డొనాల్డ్ ట్రంప్​ షేర్ చేసి.. భారత్‌తో పాటు రష్యాను కోల్పోయామన్నారు. ఈ క్రమంలో ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రధాని నరేంద్ర భారత ప్రధానితో మాట్లాడతానని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల భారత్‌పై అమెరికా విధించిన 50శాతం సుంకాలు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

మోదీ – ట్రంప్ మధ్య కొత్త సమీకరణాలు: గతంలో డొనాల్డ్ ట్రంప్​ .. భారత్ – అమెరికా మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. ఇరు దేశాల సంబంధాల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రధాని మోదీ, నేను మంచి స్నేహితులమని తెలిపారు. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటామని ట్రంప్ అన్నారు. అయితే అదే సమయంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కొన్ని పనులపై ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సానుకూలంగా స్పందించడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad