Saturday, November 15, 2025
Homeనేషనల్PM Modi : విదేశీ మోజు వీడండి - స్వదేశీకి పట్టం కట్టండి.. యువతకు ప్రధాని...

PM Modi : విదేశీ మోజు వీడండి – స్వదేశీకి పట్టం కట్టండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు!

PM Modi’s appeal for Swadeshi :  మన ఇంట్లోని అల్మారాలు విదేశీ వస్తువులతో నిండిపోతున్నాయా? మన యువతరం ఆలోచనలు, ఆకాంక్షలు పక్క దేశాల ఉత్పత్తుల చుట్టూనే తిరుగుతున్నాయా? ఈ ధోరణి మారాల్సిందేనని, దేశ ప్రగతికి పునాది కావాల్సిన యువత ‘విదేశీ మోజు’ అనే మాయ నుంచి బయటపడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్వదేశీ ఉత్పత్తులకు పట్టం కట్టడం ద్వారానే ఆత్మనిర్భర భారత్ స్వప్నం సాకారమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలు ప్రధాని ఈ పిలుపునివ్వడానికి గల కారణాలేంటి..? యువతను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారు..?

- Advertisement -

విదేశీ వ్యామోహంపై మోదీ ఆవేదన : అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాని మోదీ, దేశ యువతలో పెరుగుతున్న విదేశీ వస్తువుల వ్యామోహంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. “కొన్నిసార్లు తెలియకుండానే మన ఇంట్లోకి విదేశీ వస్తువులను చేర్చుకుంటున్నాం. మన సంప్రదాయంలో భాగం కాని వాటిని అలంకార ప్రాయంగా మార్చుకుంటున్నాం. ఈ పద్ధతి మారాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పత్తులకే మన ఓటు) అనేది కేవలం నినాదం కాదు, అదొక బాధ్యత,” అని ఆయన అన్నారు.

“ఆత్మనిర్భరతే అసలైన అభివృద్ధి” : మన దేశంలో తయారైన వస్తువులను మనం గౌరవించుకోకపోతే, ప్రపంచం వాటిని ఎలా ఆదరిస్తుందని ప్రధాని ప్రశ్నించారు. చేతివృత్తుల వారి నుంచి చిన్న, మధ్య తరహా పరిశ్రమల వరకు, ప్రతి ఒక్కరి కృషిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తుచేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా మిగిలిపోకుండా, సరికొత్త ఆవిష్కరణలతో ఉద్యోగదాతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని, తద్వారా ‘మేడిన్ ఇండియా’ బ్రాండ్‌ను ప్రపంచపటంలో అగ్రస్థానాన నిలపాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తి ప్రతి ఇంట్లోనూ వెల్లివిరియాలని, స్వదేశీ వాడకం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad