మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. శనివారం అకోలాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహా వికాస్ అఘాడి అంటేనే అవినీతి అంటూ విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో మహాయుతి కూటమిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ దేశాన్ని బలహీనం చేయడానికి ప్రయత్నిస్తోందని హర్యానా ప్రజలు ఈ కుట్రలు భగ్నం చేశారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని… మనమంతా ఐక్యంగా ఉండి వారి కుట్రలను భగ్నం చేయాలని మహారాష్ట్ర ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం
“పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంతోమంది పేదలకు పక్కా ఇళ్ళు నిర్మించింది. రాష్ట్రంలో గుడిసెలలో నివసించేవారు ఇంకా ఎవరైనా మీకు కనిపిస్తే వారి వివరాలు అడ్రెస్ తో సహా నాకు పంపించండి. వారికి శాశ్వతంగా ఒక పక్కా ఇల్లు సొంతం అవుతుందని హామీ ఇవ్వండి. ఆ హామీ నేను నెరవేరుస్తా” అని మోదీ వాగ్దానం ఇచ్చారు. “ఇక్కడి ప్రజల నుంచి నాకు ఎప్పుడూ ఆశీర్వాదాలు అందుతూనే ఉన్నాయి. మరోసారి మీ ఆశీర్వదం కోసం ఇక్కడికి వచ్చా. రానున్న ఎన్నికల్లో మహాయుతి కూటమిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను” అని మహా ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రసంగించారు.