Prajwal Revanna convicted in rape case : రాజకీయాలను కుదిపేసిన పెను సంచలనం… లైంగిక ఆరోపణల తుఫానులో చిక్కిన మాజీ ఎంపీకి ఉచ్చు బిగుసుకుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అత్యాచార కేసులో జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. న్యాయమూర్తి తీర్పు చదవగానే, కోర్టు హాలులోనే ఆయన కంటతడి పెట్టారు. ఇంతకీ ఏ కేసులో ఆయనకు శిక్ష పడింది..? ఈ కేసు పూర్వాపరాలేంటి..? శిక్ష ఎప్పుడు ఖరారు కానుంది..?
కోర్టు బోనులో కుప్పకూలిన ప్రజ్వల్ : దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచార కేసులో దోషిగా తేలారు. తమ ఇంట్లో పనిచేసే మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పును వినగానే ప్రజ్వల్ రేవణ్ణ కోర్టు గదిలోనే బోరున విలపించారు. స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ గజానన్ భట్ శనివారం నాడు ఈ కేసులో శిక్షను ఖరారు చేయనున్నారు.
దోషిగా తేలిన కేసు ఇదే : 2021లో తమ ఫామ్‌హౌజ్‌లో ప్రజ్వల్ తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ దారుణాన్ని తన మొబైల్‌లో వీడియో కూడా తీశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై తాము ఫిర్యాదు చేయగానే ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని, తన తండ్రిని ఉద్యోగంలోంచి తీసేశారని ఆమె తన ఫిర్యాదులో వాపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 2వేల పేజీల ఛార్జిషీట్‌ను, 123 ఆధారాలను కోర్టుకు సమర్పించింది. గత 14 నెలలుగా ఇదే కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రజ్వల్‌ను తాజాగా న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.
ఎన్నికల వేళ పెను దుమారం : 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా చెబుతున్న వందలాది అశ్లీల వీడియోలు బయటకు రావడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ప్రజ్వల్‌పై, ఆయన తండ్రి హెచ్.డి. రేవణ్ణపై అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేయడంతో, ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌పై దేశం విడిచి జర్మనీకి పారిపోయారు. నెల రోజుల తర్వాత తిరిగి బెంగళూరుకు రాగానే విమానాశ్రయంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆ కేసుల్లో ఒకటైన అత్యాచార కేసులో ఆయన దోషిగా తేలారు.


