The Most Popular Leader Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచ స్థాయిలో తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. అంతర్జాతీయ పరిశోధన సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ సర్వేలో మోదీకి అత్యధిక ప్రజాదరణ లభించింది. ఈ సర్వే ప్రకారం, ప్రపంచంలోని ప్రముఖ నాయకుల మధ్య మోదీ అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ముందంజలో నిలిచారు. ఆయనకు ఈ సర్వేలో 75 శాతం ప్రజల మద్దతు లభించింది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, “భారత దేశం సురక్షితమైన నాయకత్వంలో ఉంది” అంటూ వ్యాఖ్యానించారు.
ఈ సర్వే 2024 జులై 4 నుండి 10 తేదీల మధ్య నిర్వహించబడింది. మోదీ తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ 57 శాతం మద్దతుతో నిలిచారు. మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలై, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, తదితర నాయకులు ఉన్నారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44 శాతం మద్దతుతో ఎనిమిదో స్థానంలో నిలిచారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/ashok-gajapathi-raju-swearing-in-ceremony/
ఇది మోదీకి ఇదే తరహాలో వచ్చిన తొలి గుర్తింపు కాదు. గతంలోనూ అనేక సార్లు మార్నింగ్ కన్సల్ట్ సర్వేల్లో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 2021 సెప్టెంబరులో 70 శాతం, 2022 ప్రారంభంలో 71 శాతం మద్దతుతో మోదీకి ప్రపంచ స్థాయిలో అత్యధిక ఆదరణ లభించింది. ఆ తర్వాతి కాలంలో కూడా ఏప్రిల్, సెప్టెంబర్, డిసెంబర్ 2023లో నిర్వహించిన సర్వేల్లో ఆయనకు వరుసగా 76 శాతం మద్దతు లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 78 శాతంతో మోదీ మళ్లీ అగ్రస్థానాన్ని సాధించారు. ఈ సమగ్ర అంచనాల ఆధారంగా చూస్తే, నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్‌గా కొనసాగుతున్న ప్రజాదరణ మరింత బలపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ స్థిరత, పాలనా నైపుణ్యం, అంతర్జాతీయ దౌత్యం వంటి అంశాల్లో ఆయనకు లభిస్తున్న విశ్వాసం ప్రతిసారి పెరుగుతుండడం గమనార్హం.


