Bihar election Campaign : బిహార్ ఎన్నికల కురుక్షేత్రంలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 20 ఏళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని, అందుకే ఎన్డీఏ ఇప్పుడు ‘ఓట్ల దొంగతనం’ ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. చంపారణ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, మోదీ-నితీశ్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు.
ఓటు దొంగతనంతోనే అధికారం : ప్రస్తుత పాలన బ్రిటిష్ రాజు కాలాన్ని తలపిస్తోందని ప్రియాంక గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రజాతీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందని గ్రహించిన ఎన్డీఏ, హరియాణాలో మాదిరిగా ఇక్కడ కూడా ఓట్లు దొంగిలించాలని చూస్తోంది. వీరు ప్రతి వ్యవస్థను నాశనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎన్నికలు జరుగుతాయో లేదోనన్న అనుమానం కలుగుతోంది. మీరు మౌనంగా ఉండకండి, వారిని అధికారం నుంచి తరిమికొట్టండి,” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, బిహార్ సమస్యలపై కాకుండా, కాంగ్రెస్ పోస్టర్లలో తేజస్వీ యాదవ్ ఫోటో ఎందుకు లేదన్న దానిపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
పరిశ్రమలన్నీ గుజరాత్‌కే.. బిహార్‌కు అన్యాయం : కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ వివక్ష చూపుతోందని ప్రియాంక ఆరోపించారు. “పరిశ్రమలన్నీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌కే తరలిపోతున్నాయి. దీనిని బట్టే వారి ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు. భూములు, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టే వారు పేదల కోసం ఎప్పటికీ పనిచేయరు,” అని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఐదేళ్లు అంబానీ, అదానీల కోసమే పనిచేసి, ఎన్నికలొస్తేనే ప్రజల దగ్గరకు వస్తుందని ధ్వజమెత్తారు. రైతులు కనీస మద్దతు ధర లేక, అప్పులతో జీవితాలను గడుపుతుంటే, పెద్ద వ్యాపారుల రుణాలు మాత్రం మాఫీ అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మేమొస్తే.. ఉద్యోగాలు, ఉచిత వైద్యం : బిహార్‌లో నిరుద్యోగం వల్లే యువత వలస వెళ్తోందని, ఎన్డీఏ తెచ్చిన అగ్నిపథ్ పథకం వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని ప్రియాంక విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు మారుస్తామని పలు హామీలు గుప్పించారు.
ఆరోగ్యం: ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం.
ఉద్యోగాలు: ప్రతి పేద కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ విభాగాల్లో లక్షలాది ఖాళీల భర్తీ.
గృహ వసతి: ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు లేదా 3.5 డెసిమల్ భూమి (మహిళల పేరు మీద).
ఉపాధి హామీ: ఉపాధి హామీ పథకం పనిదినాలను రెట్టింపు చేయడం.
పాత పెన్షన్: పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకురావడం.


