Pune liver transplant tragedy : భర్త ప్రాణాలను నిలబెట్టేందుకు ఆ ఇల్లాలు తన ప్రాణాలను పణంగా పెట్టింది. తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేసి పునర్జన్మ ప్రసాదించాలని తపించింది. కానీ విధి చిన్నబోయింది. ఆపరేషన్ తర్వాత భర్త కన్నుమూయగా, కొద్ది రోజులకే ఇన్ఫెక్షన్‌తో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కంటతడి పెట్టిస్తోంది. అసలు ఆ ఆసుపత్రిలో ఏం జరిగింది.? వైద్యుల నిర్లక్ష్యమే ఈ దంపతుల ఉసురు తీసిందా.?
భర్త అనారోగ్యం.. భార్య త్యాగం : పూణే జిల్లాకు చెందిన బాపు కోంకర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయన కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని, తక్షణమే కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, భర్తను కాపాడుకునేందుకు ఆయన భార్య కామిని కోంకర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేసేందుకు ఆమె ముందుకు వచ్చారు.
విఫలమైన శస్త్రచికిత్స.. విషమించిన ఆరోగ్యం : కుటుంబ సభ్యుల అంగీకారంతో, పూణేలోని ప్రఖ్యాత సహ్యాద్రి ఆసుపత్రిలో ఈ నెల 15న వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. కామిని శరీరం నుంచి కాలేయంలోని కొంత భాగాన్ని విజయవంతంగా సేకరించి, ఆమె భర్త బాపు శరీరంలో అమర్చారు. అంతా సవ్యంగా జరిగిందని భావిస్తున్న తరుణంలో, ఆపరేషన్ తర్వాత బాపు ఆరోగ్యం మరింత విషమించింది.
రోజుల వ్యవధిలో దంపతుల మృతి : చికిత్సకు స్పందించని బాపు, ఆపరేషన్ జరిగిన రెండు రోజులకే ఆగస్టు 17న ఆసుపత్రిలో కన్నుమూశారు. భర్త మరణవార్తతో కుంగిపోయిన కామినికి మరో రూపంలో విధి శాపంగా మారింది. కాలేయ దానం అనంతరం ఆమెకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, నాలుగు రోజుల తర్వాత ఆగస్టు 21న కామిని కూడా తుదిశ్వాస విడిచారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమా? బంధువుల ఆందోళన : రోజుల వ్యవధిలో దంపతులిద్దరూ మరణించడంతో వారి బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది విధి రాత కాదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ మరణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ : ఈ ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రి యాజమాన్యానికి తక్షణమే నోటీసులు జారీ చేశారు. కాలేయ మార్పిడి చికిత్సకు సంబంధించిన పూర్తి రికార్డులు, రోగుల ఆరోగ్య వివరాలు, ఆపరేషన్ వీడియో ఫుటేజీలను సమర్పించాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించిన తర్వాత వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


