Pre-wedding sudden cardiac arrest : ఆ పెళ్లింట పెళ్లి బాజాలు మోగాల్సిన చోట చావు డప్పులు మోగాయి. ఆనందంతో చిందులేసిన ఆ పాదాలే అంతలోనే ప్రాణం తీస్తాయని ఎవరు ఊహించారు? కాళ్ల పారాణి ఆరకముందే, పెళ్లిపీటలెక్కాల్సిన ఆ నవవధువును గుండెపోటు రూపంలో మృత్యువు కబళిస్తుందని కలలో కూడా అనుకోలేదు. పంజాబ్‌లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన, సంతోషంలో మునిగి తేలుతున్న రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
ఆనందం నుంచి ఆర్తనాదంలోకి : పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా, బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి, పక్క గ్రామ వాసి, దుబాయ్‌లో పనిచేసే యువకుడితో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించి, అక్టోబర్ 24న వైభవంగా వివాహం జరిపించాలని నిశ్చయించారు. పెళ్లి కొడుకు కూడా దుబాయ్ నుంచి తిరిగి రావడంతో ఇరు ఇళ్లలో సందడి వాతావరణం నెలకొంది.
వివాహానికి ఒక రోజు ముందు, అక్టోబర్ 23న వధువు ఇంట్లో ‘జాగరన్’ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పెళ్లికూతురు పూజ ఉత్సాహంగా భాంగ్రా, గిద్ద నృత్యాలు చేస్తూ అందరినీ అలరించింది. కుటుంబ సభ్యులను కూడా తనతో పాటు డ్యాన్స్ చేయించి సందడి చేసింది. ఆనందం అంబరాన్నంటిన ఆ క్షణాలు ఎంతో సేపు నిలవలేదు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, పూజ ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. పూజ తీవ్రమైన గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త తెలియగానే ఆ పెళ్లింట ఆర్తనాదాలు మిన్నంటాయి.
కుటుంబాల కన్నీటి రోదన : “మా రెండు కుటుంబాలు పెళ్లి విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. పెళ్లికి ముందు రోజు నా కూతురు ఎంతో చక్కగా డ్యాన్స్ చేసింది. మాతో కూడా చేయించింది. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు” అని పెళ్లికూతురు తండ్రి హర్జిందర్ సింగ్ కన్నీరుమున్నీరుగా విలపించారు.
వరుడి సోదరుడు మంటు మాట్లాడుతూ, “బంధువులందరూ వచ్చారు, వేడుకలు సంతోషంగా జరుగుతున్నాయి. ఇంతలో దేవుడు మాపై దయ చూపలేదు. పెళ్లి కోసం తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువులను వాడకుండానే వెళ్లిపోయింది. పెళ్లి కోసం చేసిన అప్పులతో ఇప్పుడు రెండు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
డీజే శబ్దాలు ప్రాణం తీస్తున్నాయా : ఈ ఘటన నేపథ్యంలో వైద్య నిపుణులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో మితిమీరిన డీజే శబ్దాలు గుండెకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 70 నుంచి 85 డెసిబెల్స్ శబ్దం వరకు చెవులు తట్టుకోగలవు. కానీ, డీజేల వద్ద 90 నుంచి 120 డెసిబెల్స్ వరకు శబ్ద తీవ్రత ఉంటోంది. ఈ తీవ్రమైన ధ్వని కాలుష్యం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతి నిరాకరిస్తున్నా, నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి వరకు వాటిని వినియోగిస్తుండటం గమనార్హం.


