Gang-related violence in Punjab : పంజాబ్‌లో మరోసారి తుపాకులు గర్జించాయి. కబడ్డీ క్రీడాకారుడి రక్తం నేలపాలైంది. లూధియానాలో గుర్విందర్ సింగ్ (23) అనే యువ ఆటగాడిని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. వారం రోజుల వ్యవధిలోనే మరో కబడ్డీ క్రీడాకారుడు హత్యకు గురవడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్యకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు కబడ్డీ ఆటగాళ్లనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? రాష్ట్రంలో గ్యాంగ్ వార్ ముదురుతోందా?
మంకీ గ్రామానికి చెందిన కబడ్డీ ఆటగాడు గుర్విందర్ సింగ్, తన స్నేహితులు ధర్మవీర్ సింగ్, లవ్‌ప్రీత్ సింగ్‌లతో కలిసి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ దుకాణం వద్ద నిల్చుని ఉన్నారు. అదే సమయంలో మోటార్‌బైక్‌లపై వచ్చిన నలుగురు ముసుగు దుండగులు, వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో గుర్విందర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లగా, స్నేహితుడు ధర్మవీర్ కాలికి తీవ్ర గాయమైంది. లవ్‌ప్రీత్ అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ మొదట సమ్రాలా సివిల్ ఆసుపత్రికి, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో చండీగఢ్‌లోని పీజీఐకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుర్విందర్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత? : ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే, ‘అన్మోల్ బిష్ణోయ్’ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఓ పోస్ట్ వెలువడింది. కరణ్ మధ్‌పుర్, తేజ్‌చక్‌లు ఈ హత్య చేశారని, దీనికి హ్యారీ బాక్సర్, ఆర్జూ బిష్ణోయ్ బాధ్యత వహిస్తారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్ట్ నిజంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పెట్టిందా లేదా అనేదానిపై పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
పోలీసుల దర్యాప్తు.. కుటుంబం కన్నీరు : ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్పీ పవన్ జిత్ తెలిపారు. “మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. నా కొడుకును ఎందుకు చంపారో తెలియడం లేదు,” అంటూ మృతుడి తండ్రి రాజేంద్ర సింగ్ కన్నీరుమున్నీరయ్యారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వారం వ్యవధిలో రెండో హత్య : అక్టోబర్ 31న లూధియానా జాగ్రావ్‌లో తేజ్‌పాల్ సింగ్ అనే మరో కబడ్డీ ఆటగాడిని ఇలాగే కాల్చి చంపారు. ఆ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే, ఇప్పుడు గుర్విందర్ సింగ్ హత్యకు గురవడం స్థానికంగా భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో గ్యాంగ్ వార్ హింస పెరిగిపోతోందని, క్రీడాకారులకు కూడా రక్షణ కరువైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


