Saturday, November 15, 2025
Homeనేషనల్Punjab Lottery 2025: అప్పుతో కొన్న టికెట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. కూరగాయల వ్యాపారికి రూ.11...

Punjab Lottery 2025: అప్పుతో కొన్న టికెట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. కూరగాయల వ్యాపారికి రూ.11 కోట్ల పంట!

Punjab Diwali Bumper Lottery winner : అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు కూరగాయలు అమ్ముకుంటూ పూట గడవడమే కష్టంగా బతుకుతున్న ఓ సామాన్యుడి తలుపు తట్టింది. అదీ మామూలుగా కాదు.. ఏకంగా రూ.11 కోట్ల బంపర్ బహుమతి రూపంలో! విధి ఆడిన వింత నాటకంలో, లాటరీ టికెట్ కొనడానికి స్నేహితుడి వద్ద అప్పు చేసిన ఆ వ్యక్తి, ఆ లాటరీ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి కూడా మరోసారి అప్పు చేయాల్సి వచ్చింది. అప్పుల ఊబిలో ఉన్న ఆ సామాన్యుడి జీవితాన్ని ఆ లాటరీ టికెట్ ఎలా మార్చేసింది? స్నేహితుడికిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు? ఆ ఆసక్తికరమైన కథే ఇది.

- Advertisement -

ఛాయ్ తాగడానికి ఆగితే.. కోటీశ్వరుడయ్యాడు : రాజస్థాన్‌లోని కోట్‌పుట్లికి చెందిన అమిత్ సెహరా ఒక సాధారణ కూరగాయల వ్యాపారి. ఇటీవల పంజాబ్‌లోని మోగాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తూ, మార్గమధ్యలో భఠిండా వద్ద ఛాయ్ తాగడానికి తన స్నేహితుడు ముకేశ్‌తో కలిసి ఆగాడు. అక్కడే ఉన్న ‘రతన్ లాటరీ కేంద్రం’ వారిని ఆకర్షించింది. స్నేహితుడు ముకేశ్ ప్రోత్సాహంతో, పంజాబ్ ప్రభుత్వ దీపావళి బంపర్ లాటరీ టికెట్ కొనాలని అమిత్ నిర్ణయించుకున్నాడు. అయితే, తన వద్ద డబ్బులు లేకపోవడంతో, స్నేహితుడు ముకేశ్ వద్దే రూ.1,000 అప్పుగా తీసుకుని తన పేరు మీద, తన భార్య పేరు మీద రెండు టికెట్లు కొనుగోలు చేశాడు. ఆ సమయంలో సరదాగా, “ఒకవేళ నాకు లాటరీ వస్తే నీ కుమార్తెల పేరిట రూ.కోటి డిపాజిట్ చేస్తాను” అని స్నేహితుడికి మాటిచ్చాడు.

నాలుగు రోజుల సస్పెన్స్.. విజేత ఎవరంటే : పంజాబ్ ప్రభుత్వం లాటరీ ఫలితాలను ప్రకటించి, ఏ సిరీస్ 438586 నంబర్ టికెట్‌కు రూ.11 కోట్ల బహుమతి వచ్చిందని వెల్లడించింది. అయితే, ఆ విజేత ఎవరనేది నాలుగు రోజుల పాటు సస్పెన్స్‌గా మారింది. చివరకు, అమిత్ సెహరా తన భార్యాపిల్లలతో కలిసి లాటరీ కార్యాలయానికి వచ్చి, తానే ఆ విజేత అని రుజువులు సమర్పించాడు. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందని అధికారులు అడగ్గా, “జైపూర్ నుంచి పంజాబ్ వచ్చి లాటరీ క్లెయిమ్ చేసుకునేందుకు కూడా నా వద్ద డబ్బులు లేవు. మళ్ళీ అప్పు చేసి వచ్చాను,” అని చెప్పడంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు.

మాట నిలబెట్టుకున్న స్నేహితుడు : “నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నా కష్టాలన్నీ తీరిపోయాయి. స్నేహితుడి వల్లే నేను ఈ రోజు కోటీశ్వరుడిని. నేను ఇచ్చిన మాట ప్రకారం, అతని ఇద్దరు కుమార్తెల పేరిట చెరో రూ.50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాను,” అని అమిత్ ఉద్వేగంగా తెలిపాడు. పన్నులు పోనూ తనకు దాదాపు రూ.7.7 కోట్లు చేతికి వస్తాయని, ఆ డబ్బుతో పిల్లలను బాగా చదివించుకుని, మంచి ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. 35 ఏళ్లుగా లాటరీలు అమ్ముతున్న తాను, 40 మందికి పైగా కోటీశ్వరులను చూశానని లాటరీ కేంద్రం నిర్వాహకుడు ఉమేశ్ ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad