CP Radhakrishnana: ఊహించిన ఫలితమే వెలువడింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలుపొందారు. మొత్తం 781 మంది సభ్యులకుగాను 767 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే తరఫున సీపీ రాధా కృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విజయానికి కావాల్సిన ఓట్లు 377 కాగా.. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. కాగా 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. పోలైన మొత్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. పార్లమెంట్ నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి 8 గంటల ప్రాంతంలో ఫలితం ప్రకటించారు.
17వ ఉపరాష్ట్రపతి
భారత 17వ ఉప రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించిన ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతి పీఠం అధిష్ఠించనున్న మూడో వ్యక్తిగా రాధాకృష్ణన్.
పలువురి శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు తదితరులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ…‘సమాజ సేవకు, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు రాధాకృష్ణన్ తన జీవితాన్ని అంకితం చేశారు. రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే, పార్లమెంటరీ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా నిలుస్తారని విశ్వసిస్తున్నా’ అని ధీమా వ్యక్తం చేశారు.
‘నూతన ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ సంప్రదాయాల నైతికతను కాపాడుతారని ఆకాంక్షిస్తున్నాం. అధికారవర్గం ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు, గౌరవం అందిస్తారని ఆశిస్తున్నాం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
‘ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ ఎన్నిక కావడం.. ఆయన పట్ల దేశ ప్రతినిధుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది’ అని తాజా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకాంక్షించారు.
జనసంఘ్ నుంచి..
సీపీ రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసులో తొలిసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జన సంఘ్ సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన 1974లో సంఘ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా పని చేశారు. పలు ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలుపొందారు. తమిళనాడు బీజేపీ శాఖకు ఆయన 2004, 2007లో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
ఐరాస 58 సెషన్‌లో పాల్గొన్న పార్లమెంటరీ బృందంలో ఆయన సభ్యుడు. 2003 అక్టోబరులో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడంతోపాటు మానవీయ, విపత్తు సహా సమన్వయంపై నాడు మాట్లాడారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా..
రాధాకృష్ణన్ సేవలను గుర్తించిన మోడీసర్కారు 2023లో ఝార్కండ్ గవర్నర్‌గా నియమించింది. దాదాపు ఏడాదిన్నర అక్కడ పనిచేసిన తర్వాత గతేడాది మార్చిలో తమిళసై సౌందర రాజన్ రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కానీ, జూలైలో ఆయన్ను మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించారు.
ధన్‌ఖడ్ రాజీనామాతో..
హఠాత్తుగా ఆరోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.


