Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, సోమవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ భారీగా ఖర్చు చేస్తోందని రాహుల్ ఆరోపించారు. నేను సరైన దారిలో రాజకీయాలు చేస్తున్నానని, అందరిని కలుపుకొని అభివృద్ధికి బాటలు వేసేలా నా రాజకీయ గమ్యం ఉంటుందని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో రైతుల కష్టాలు తీరడం లేదని అన్నారు. మీడియానుసైతం బీజేపీ నియంత్రిస్తుందని ఆరోపించారు. మీడియాలో రైతుల కష్టాలు తెలియజేసే వార్తలు రావడం లేదని కేవలం బీజేపీ నాయకులు మాత్రమే కనపడుతున్నారని రాహుల్ చెప్పారు. నేను సరైన దారిలో వెళ్తున్నందుకే తనపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని రాహుల్ చెప్పారు. భారత్ జోడోయాత్రను నేను రాజకీయాలకోసం చేయడం లేదని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలపైనా రాహుల్ స్పందించారు. ముఖ్యమంత్రి రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ వర్గవిబేధాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని విలేకరుల ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని అన్ని సర్దుకుంటాయని అన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్‌ను ద్రోహి అనడంపై రాహుల్ స్పందించారు. ఎవరు ఏమన్నారనే విషయంలోకి తాను వెళ్లాలనుకోవడం లేదని, ఇద్దరు నేతలూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని చెప్పారు. గెహ్లాట్ వ్యాఖ్యలు రాజస్థాన్‌లో తన భారత్ జోడో యాత్రకు విఘాతం కలిగించవని రాహుల్ చెప్పారు. అదేవిధంగా అమేథీలో పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని రాహుల్ చెప్పారు.