Rahul Gandhi Bihar yatra : రాజకీయాల్లో నిరసనలు, నినాదాలు సర్వసాధారణం. కానీ, నిప్పులు చెరిగే విమర్శల స్థానంలో తీపి పలకరింపులు చోటుచేసుకుంటే? నల్లజెండాల చేతుల్లోకే మిఠాయి పొట్లాలు వచ్చి చేరితే..? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ పర్యటనలో సరిగ్గా ఇదే జరిగింది. తనకు వ్యతిరేకంగా గళం విప్పిన వారి పట్ల ఆయన చూపిన సౌమ్యత అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిహార్‌లో చేపట్టిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ఒక అనూహ్యమైన, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తన పర్యటనను వ్యతిరేకిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు, జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గాంధీగిరితో జవాబు: వివరాల్లోకి వెళితే, ఇటీవల రాహుల్ గాంధీ పాల్గొన్న ఒక సభలో కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది బీజేవైఎం ఆరోపణ. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దానికి నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు రాహుల్ యాత్రను అడ్డుకుని, నల్ల జెండాలు ప్రదర్శించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఉద్రిక్తత నెలకొంటుంది. కానీ, రాహుల్ గాంధీ అందుకు భిన్నంగా స్పందించారు. నిరసనకారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయకుండా, వారి వద్దకు తన సిబ్బంది ద్వారా మిఠాయిలు పంపించి “గాంధీగిరి” ప్రదర్శించారు. ఈ అనూహ్య చర్యతో నిరసనకారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
ఓట్ల చోరీపై తీవ్ర ఆరోపణలు: ఈ నిరసనల సెగ తగులుతున్నప్పటికీ, రాహుల్ గాంధీ తన యాత్రను మొక్కవోని దీక్షతో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఈ దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు ఎన్నికల సంఘం కూడా కలిసి ఓట్లను దొంగిలిస్తున్నాయి” అని సంచలన ఆరోపణలు చేశారు. బిహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఓట్ల పరిరక్షణ కోసం తాను చేపట్టిన ఈ యాత్ర, దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
క్షమాపణ డిమాండ్ – రాహుల్ స్పందన: మరోవైపు, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ విషయంపై మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై రాహుల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “సత్యం, అహింస గెలుస్తాయి… అసత్యం, హింస నిలబడవు” అని పరోక్షంగా సమాధానమిచ్చారు. ఓటు హక్కు అనేది దళితులు, మైనారిటీలు, మహిళల ఆత్మగౌరవమని, కానీ మోదీ ప్రభుత్వం కేవలం గెలుపు కోసం ఆ హక్కునే దొంగిలించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. బిహార్‌లో ఒక్క ఓటు కూడా దొంగతనానికి గురికాకుండా కాంగ్రెస్ పార్టీ కాపలా కాస్తుందని ఆయన హామీ ఇచ్చారు.


