Rahul Gandhi’s Voter Rights March : “ఈ దేశంలో ఎన్నికల సంఘం (ఈసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో చేతులు కలిపి ఓట్లను దొంగిలిస్తోంది”— ఈ సంచలన ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ గడ్డపై ‘ఓటర్ అధికార్ యాత్ర’కు శ్రీకారం చుట్టారు. ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ’ (SIR) పేరుతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను తస్కరించేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆయన నిప్పులు చెరిగారు. పేదల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు హక్కు అని, దానిని కాపాడేందుకే ఈ పోరాటమని ప్రకటించారు.
బీహార్‌లో యాత్రకు బీజం: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని 20 జిల్లాల మీదుగా 1,300 కిలోమీటర్ల మేర ‘ఓటర్ అధికార్ యాత్ర’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ససారంలో జరిగిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర కేవలం రాజకీయ యాత్ర కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే మహోద్యమమని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర, కర్ణాటక అనుభవాలతో ఆరోపణలు: రాహుల్ గాంధీ తన ఆరోపణలకు బలం చేకూర్చేందుకు మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపారు.
మహారాష్ట్ర మతలబు: “లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ‘ఇండియా’ కూటమి అద్భుతంగా రాణించింది. కానీ నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి స్వీప్ చేసింది. దీనిపై ఆరా తీస్తే, ఏకంగా 1 కోటి మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం వల్లే ఫలితం తారుమారైందని తెలిసింది,” అని రాహుల్ వివరించారు.
కర్ణాటకలో చోరీ: “కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్షకు పైగా ఓట్లు చోరీకి గురైనట్లు మా పరిశీలనలో తేలింది. అందుకే అక్కడ లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలిచింది,” అని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై తాను స్పందిస్తే, ఈసీ తనను అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించిందే తప్ప, బీజేపీని మాత్రం ప్రశ్నించలేదని ఆయన విమర్శించారు.
‘ఇండియా’ కూటమి నేతల గళం: ఈ యాత్రకు ‘ఇండియా’ కూటమిలోని ఇతర పక్షాల నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు.
మోదీ ప్రమాదకారి (మల్లికార్జున ఖర్గే): “ప్రధాని మోదీ చాలా ప్రమాదకారి. ఆయన్ను అధికారం నుంచి తప్పించకుంటే ఓట్లు, హక్కులు, రాజ్యాంగం అన్నీ ప్రమాదంలో పడతాయి. బీజేపీకి ఏజెంట్‌లా ఈసీ పనిచేస్తోంది,” అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.
ఎన్డీఏను ఓడిస్తాం (లాలూ ప్రసాద్ యాదవ్): “దేశంలో ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం,” అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భరోసా ఇచ్చారు.
ఓట్ల లూటీని అడ్డుకుంటాం (తేజస్వి యాదవ్): “ఎస్ఐఆర్ అనేది ఓట్ల లూటీ తప్ప మరొకటి కాదు. బీజేపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోంది. ప్రజల ఓట్లను దొంగిలించే కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం,” అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హెచ్చరించారు.
యాత్ర లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణే: ఈ యాత్ర ఉద్దేశాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వివరిస్తూ, “ఇది కేవలం రాజకీయ యాత్ర కాదు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామిక సంస్థలను పునరుద్ధరించడం, మరియు ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడటం. ఈ ఆశయాలతోనే యాత్ర ముందుకు సాగుతోంది.”


